Chandrababu: లిక్కర్ వ్యవహారంతో ప్రమేయం ఉన్న కుటుంబాలు బాగుపడవు: చంద్రబాబు

- ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయభేరి
- చంద్రబాబు మీడియా సమావేశం
- లిక్కర్ డబ్బు పాపిష్టిది అని వ్యాఖ్యలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి మిత్రపక్షం బీజేపీ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో, ఏపీ సీఎం చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఢిల్లీ ప్రజలు బీజేపీకి చారిత్రాత్మక విజయాన్ని అందించారని వివరించారు. ప్రధాని మోదీ సమర్థ నాయకత్వానికి, సుస్థిర పాలనకు పట్టం కట్టారని... ఇది దేశ ప్రజలందరి గెలుపు అని అభివర్ణించారు.
అది పాపిష్టి డబ్బు
ఢిల్లీ ప్రజలు కొంత సమయం తీసుకున్నారు కానీ మన ఏపీ ప్రజలు బటన్ నొక్కే కార్యక్రమానికి విసుగొందారు. గత ఐదేళ్లలో పాలకులు చిన్న, పెద్దా లెక్కలేకుండా ఇష్టానుసారంగా మాట్లాడారు. లిక్కర్ లో జోక్యం చేసుకున్న కుటుంబాలు బాగుపడవు. అది పాపిష్టి డబ్బు. పేదవారి ఆరోగ్యాన్ని నాశనం చేసి ఎంజాయ్ చేసే అధికారం పాలకులకు లేదు. లిక్కర్ మాఫియాను నడిపారు. వ్యవస్థలను నాశనం చేశారు.
దేవతలు ధ్యానం చేసిన రుషికొండ ప్రాంతంలో ప్యాలెస్ కట్టుకున్నారు. ఢిల్లీలోనూ శీష్ మహల్ కట్టారు. అక్కడా, ఇక్కడా ప్యాలెస్ లోకి వారు వెళ్లలేదు. రూ.10 లక్షల కోట్ల అప్పులు చేశారు. విధ్వంసం చాలా సులభం. నిర్మాణాత్మకంగా పనిచేయడం చాలా కష్టం. పాలకులు ఎవరైనా ప్రజలకు సంక్షేమం అందించి , రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. అదే సుస్థిర పాలన.
తెలంగాణలో నిరసనలు అణగదొక్కాలని చూశారు... ఏమైందో అందరం చూశాం!
నా అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ 60 దేశాల్లో నిరసనలు తెలిపారు. తెలంగాణలోనూ నిరసనలు జరిగాయి. వాటిని అణగదొక్కాలని చూశారు. కానీ ఏమైందో అందరం చూస్తున్నాం. ఒకప్పుడు కమ్యూనిస్టులు బలంగా ఉన్నారు. నేడు ఆదరణ కోల్పోయారు.
1995లో నేను ప్రజలను చైతన్య పరిచాను. నేడు నరేంద్రమోదీ అదే చేస్తున్నారు. నేడు ప్రజలకు సంతృప్తి కలిగే పాలన అందిస్తున్నాను. ఏ ఆఫీసర్, ఏ కార్యకర్త తప్పు చేసినా నాదే బాధ్యత.
సాంకేతికత సాయంతో ఫైల్స్ ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని నేను మంత్రులకు చెబితే వక్రీకరించి రాస్తున్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ను కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రజలను మభ్య పెట్టి ఇష్టానుసారంగా పక్కదారి పట్టిస్తున్నారు" అని సీఎం చంద్రబాబు అన్నారు.