Chiranjeevi: నాపై ఓ రాజకీయనేత అవాకులు చెవాకులు పేలాడు: చిరంజీవి

- చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమానికి హాజరైన చిరంజీవి
- ఓ మహిళ గురించి ఆసక్తికర అంశం వెల్లడి
- ఆమె తన అభిమాని కూడా కాదని వివరణ
చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఓ ఆసక్తికరమైన అంశం వెల్లడించారు. గతంలో తాను దేశ ప్రధానితో కలిసి అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నానని, అది చూసి ఓ రాజకీయ నాయకుడు తనపై అవాకులు చెవాకులు పేలాడని తెలిపారు. అప్పటికి తాను రాజకీయాలు వద్దనుకుని దూరంగా వచ్చేసినవాడ్ని అని చిరంజీవి వివరించారు.
"నా మీద గౌరవంతోనో, లేకపోతే నన్ను ఎంకరేజ్ చేయాలనో, పశ్చిమ గోదావరి జిల్లా వాడ్ని కాబట్టి, లేకపోతే సెలబ్రిటీని కావడం వల్లనో నన్ను ఆ కార్యక్రమానికి పిలిచారు. దాంతో నేను ఆ సభకు వెళ్లాను. కానీ ఆ నాయకుడు నా గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అతడు అలా ఎందుకు మాట్లాడడో అర్థం కాలేదు. అతడు అన్న మాటల్లో నిజం లేనప్పుడు ఆ మాటలు నాకు తాకవు, నేను ఫీలవును. ఆ రాజకీయ నేత తన స్వభావాన్ని బయటపెట్టుకున్నాడు.
నా స్వభావం ఏంటంటే... అలాంటి వాటికి స్పందించను. కానీ, నన్ను ప్రేమించే వాళ్లు అలాంటి ఘటనలకు స్పందిస్తుంటారు. వాళ్ల స్పందన ఎలా ఉంటుందో తెలియాలంటే ఓ ఉదాహరణ చెబుతాను.
నన్ను తిట్టిన వ్యక్తి ముంపు గ్రామాల పరిశీలన కోసం తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వెళితే... ఓ బిడ్డ తల్లి అతడిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది. ఆమె మాస్ కాదు... చూస్తే చాలా క్లాస్ లేడీలా అనిపించింది. ఓ మోతుబరి రైతు కుటుంబానికి చెందిన ఆమెలా, రిచ్ ఫ్యామిలీకి చెందిన దానిలా కనిపించింది. తిరిగి వస్తావు కదా... నీ అంతు చూస్తానంటూ ఆ నేతకు వార్నింగ్ కూడా ఇచ్చింది. ఎవరో ఆ క్లిప్పింగ్ ను నాకు పంపించారు.
ఎవరైనా ఫ్యాన్స్ ఇలా తిట్టి ఉంటే... అబ్బా, అనవసరంగా ఇలా చేస్తున్నారే అని బాధపడేవాడ్ని... సర్లే, వాళ్ల ఆవేశం అలా ఉంది అని సర్దిచెప్పుకునేవాడ్ని. కానీ ఆ గృహిణిని చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలిగింది. దాంతో నాకు ఆసక్తి కలిగింది... ఆమె ఎవరో కనుక్కోండి అని చెప్పాను. ఆమెతో మాట్లాడి, ఓ ఇంటర్వ్యూలా చేసి ఓ వీడియోను నాకు పంపారు.
అందులో ఆమె చెప్పిన విషయాలు ఏంటంటే... చిరంజీవి అంటే మాకు ఆరాధ్యుడు అండీ అని చెప్పింది. అలాగని ఆమె నాకు అభిమాని కాదు. ఆమె అందరు హీరోల సినిమాలు చూస్తుందట. అలాగే నా సినిమాలు కూడా చూస్తుందట. మరి ఏంటమ్మా... ఆ నాయకుడిపై మాస్ అభిమానిలా అంతలా రెచ్చిపోయావు అని మా వాళ్లు అడిగారు.
అప్పుడామె... ఆయన (చిరంజీవి) నా బిడ్డకు ప్రాణం పోశాడండీ అని చెప్పింది. ఓ 8 ఏళ్ల బాబును ఇటు రమ్మని ఆమె పిలిచింది. దాంతో ఓ అబ్బాయి వచ్చాడు. వీడికి డెంగ్యూ వచ్చి, రక్తం దొరక్క, ప్లేట్ లెట్స్ పడిపోయి... రెండ్రోజుల్లో రక్తం ఎక్కించకపోతే చచ్చిపోతాడు అనే స్థితికి వచ్చాడు. మా బిడ్డ బాధ చూడలేకపోయాం. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా రక్తం దొరకలేదు. ఎవరో చెప్పారు... చిరంజీవి బ్లడ్ బ్యాంకుకు ఫోన్ చేయమ్మా... తప్పకుండా దొరుకుతుంది అని.
ఎక్కడ రాజమండ్రి... ఎక్కడ హైదరాబాద్... జరిగే పనేనా అని ఆమె నిరాశ చెందింది. లేదమ్మా... నువ్వు ఫోన్ చేయి అని చెప్పడంతో ఆమె ఫోన్ చేసింది. ఆ ఫోన్ కాల్ రాగానే... హైదరాబాదులోని మన అద్భుతమైన స్టాఫ్ వెంటనే స్పందించి స్వామినాయుడికి తెలియజేస్తే... స్వామినాయుడు వెంటనే రంగంలోకి దిగి కొందరు అభిమానులకు తెలియజేశాడు. దాంతో ఐదారుగురు కుర్రాళ్లు ముందుకొచ్చి రక్తం ఇవ్వడంతో ఆ అబ్బాయి ప్రాణం నిలబడింది. ఇప్పుడు చెప్పండయ్యా.... కళ్లెదుటే చావుబతుకుల్లో ఉన్న నా బిడ్డ బతికి బట్టకట్టాడు, ఇవాళ ఇలా తిరుగుతున్నాడు అంటే ఆయన (చిరంజీవి) దేవుడు కాక ఇంకేమవుతాడు? అలాంటి వ్యక్తిని ఆ నాయకుడు అన్నేసి మాటలు అంటాడా? అంటూ ఆ మహిళ తిట్టేసింది" అని చిరంజీవి వివరించారు.