BJP: బీజేపీ 48... ఆప్ 22... ఢిల్లీలో ముగిసిన ఓట్ల లెక్కింపు

BJP claims 48 seats in Delhi assembly elections
  • ఢిల్లీ అసెంబ్లీలో 70 సీట్లు
  • ఈ నెల 5న అసెంబ్లీ ఎన్నికలు
  • నేడు (ఫిబ్రవరి 8) ఓట్ల లెక్కింపు
  • ఢిల్లీ పీఠం చేజిక్కించుకున్న బీజేపీ
  • మట్టికరిచిన అధికార ఆప్
  • కనీసం ఉనికిని చాటుకోలేకపోయిన కాంగ్రెస్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. బీజేపీ 48 స్థానాలతో చారిత్రక విజయం సాధించగా, ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలతో సరిపెట్టుకుంది. కౌంటింగ్ ముగిసే సమయానికి బీజేపీ 47 స్థానాలు కైవసం చేసుకోగా, ఓ స్థానంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 

ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. ఈసారి కూడా తామే గెలుస్తామని ఆప్ నిబ్బరంగా ఉన్నప్పటికీ, ఓటరు తీర్పు అందుకు భిన్నంగా ఉంది. వరుసగా రెండు పర్యాయాలు ఆప్ ను గెలిపించిన ఢిల్లీ ప్రజలు... ఈసారి బీజేపీకి జై కొట్టారు. ఈ విజయంతో 27 ఏళ్ల తర్వాత బీజేపీ మళ్లీ ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించబోతోంది. 

మరోవైపు, కాంగ్రెస్ పార్టీపై ఢిల్లీ ఓటర్లు ఏమాత్రం కరుణ చూపలేదు. సుదీర్ఘ చరిత్ర ఉన్న హస్తం పార్టీకి ఈ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా రాలేదు. 

ఇక, బీజేపీ విజయంతో ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనేతలు, కార్యకర్తలు పొంగిపోతున్నారు. ఈ నెల 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా... నేడు (ఫిబ్రవరి 8) ఓట్ల లెక్కింపు చేపట్టారు. బీజేపీ తిరుగులేని విజయం సాధించిన నేపథ్యంలో... కొత్త సీఎం ఎవరన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. 

మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఓటమి రుచిచూపిన పర్వేశ్ వర్మ తదుపరి సీఎం అంటూ ప్రచారం జరుగుతోంది. న్యూఢిల్లీ నియోజకవర్గం ఫలితం వెలువడిన వెంటనే పర్వేశ్ వర్మను కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడారు. దాంతో, పర్వేశ్ వర్మ తదుపరి సీఎం అంటూ మరింత జోరుగా కథనాలు వచ్చాయి. 

అయితే, బీజేపీ ఢిల్లీ వ్యవహారాల ఇన్చార్జి బైజయంత్ పాండా మాత్రం... సీఎం ఎవరన్నది బీజేపీ హైకమాండ్ చూసుకుంటుందని, దీనిపై ఊహాగానాలు వద్దని సూచించారు.
BJP
Delhi Assembly Elections
AAP
Congress

More Telugu News