G. Kishan Reddy: కేజ్రీవాల్ నాయకత్వంలోనే మద్యం కుంభకోణం జరిగిందని ప్రజలు నమ్మారు: కిషన్ రెడ్డి

- కేజ్రీవాల్ అవినీతికి చిరునామాగా మారిపోయారన్న కిషన్ రెడ్డి
- అవినీతికి పాల్పడితే ప్రజలు ఏం చేస్తారో చెప్పేందుకు ఈ ఫలితాలు నిదర్శనమని వ్యాఖ్య
- కాంగ్రెస్ పార్టీకి గెలవాలనే ఆలోచన ఎప్పుడూ లేదని ఎద్దేవా
- మోదీని, బీజేపీని ఓడించాలనే పనిచేస్తారని ఆగ్రహం
అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోనే ఢిల్లీ మద్యం కుంభకోణం జరిగిందని ప్రజలు విశ్వసించారని, అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీ ప్రజలు మద్యం కుంభకోణంపై తీర్పు ఇచ్చారన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతామని రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్ చివరకు ఆయనే అవినీతికి చిరునామాగా మారిపోయారని విమర్శించారు.
ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోతే ప్రజలు ఏం చేస్తారో చెప్పడానికి ఢిల్లీ ఫలితాలే నిదర్శనమని ఆయన అన్నారు. కేజ్రీవాల్, సిసోడియా లాంటి నేతలను ప్రజలు ఓడించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దీనస్థితిని చూస్తుంటే అందరికీ జాలి కలుగుతోందన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి ఇది ఎన్నో ఓటమో లెక్కబెట్టుకోవాలని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో వరుసగా మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ డకౌట్ అయిందని విమర్శించారు.
అసలు కాంగ్రెస్ పార్టీకి గెలవాలనే ఆలోచన ఎప్పుడూ లేదని ఎద్దేవా చేశారు. కేవలం బీజేపీని, మోదీని ఓడించాలనే ఉద్దేశంతోనే వారు పనిచేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరగడం కాదని, విలువలు పాటించాలని హితవు పలికారు. మద్యం కుంభకోణానికి సంబంధించి ఢిల్లీ ప్రజలు తీర్పు ఇచ్చారని, ఇక కోర్టు తీర్పు రావాల్సి ఉందని ఆయన అన్నారు.
ఎన్ని ఉచిత పథకాలు ఇస్తామని చెప్పినప్పటికీ ప్రజలు కేజ్రీవాల్‌ను నమ్మలేదన్నారు. జైలు నుండి పాలన చేసిన కేజ్రీవాల్ డ్రామాలకు ఢిల్లీ ప్రజలు సరైన విధంగా తీర్పు ఇచ్చారన్నారు. ఢిల్లీలో కొన్నేళ్లుగా అభివృద్ధి నిలిచిపోయిందని, బీజేపీ అధికారంలోకి వచ్చినందున ఇక అభివృద్ధి ప్రారంభమవుతుందన్నారు.