Konda Surekha: ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో... కేటీఆర్‌కు మంత్రి కొండా సురేఖ కౌంటర్

- కేటీఆర్ నుండి అలాంటి ప్రకటన ఆశ్చర్యాన్ని కలిగించిందన్న మంత్రి
- మీ మోదీ అంకుల్ గెలుపులో మీ సోదరి కీలక పాత్ర పోషించిందని ఎద్దేవా
- నెక్ట్స్ టైమ్ బెటర్ లక్ అంటూ కేటీఆర్‌కు చురక
మీ మోదీ అంకుల్ గెలుపులో కీలక పాత్ర పోషించిన మీ సోదరి కవితను అభినందించాలని మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీలో బీజేపీ గెలిచిన నేపథ్యంలో కేటీఆర్ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ విజయానికి కృషి చేసిన అతిపెద్ద కార్యకర్త రాహుల్ గాంధీయేనని ఎద్దేవా చేశారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు.
కేటీఆర్ నుండి ఇలాంటి ప్రకటన తమను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. 2019, 2024 లోక్ సభ ఎన్నికలలో కరీంనగర్ నుండి బీజేపీ గెలిచిందన్నారు. అలాగే మీ సోదరి కవిత నిజామాబాద్ లోక్ సభ స్థానం నుండి ఓడిపోయారని గుర్తు చేశారు. ఈ విషయాలను గుర్తుంచుకొని మాట్లాడాలన్నారు. మీ మోదీ అంకుల్ గెలుపులో కీలక పాత్ర పోషించినందుకు మీ సోదరిని అభినందించాలని మద్యం కేసును ఉద్దేశించి కౌంటర్ ఇచ్చారు.
రాజ్యాంగానికి మించిన వారు ఎవరూ లేరని లోక్ సభ ఎన్నికల ఫలితాల ద్వారా మోదీకి అర్థమయ్యేలా రాహుల్ గాంధీ చేశారని పేర్కొన్నారు. వారి నాయకత్వం మీ కుటుంబానికి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుని పదవిని కట్టబెట్టేందుకు సహాయపడిందన్నారు. అయినప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సున్నాతో తుడిచిపెట్టుకుపోయిందని విమర్శించారు.
రాహుల్ గాంధీ ప్రభావాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేయవద్దని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా వెనుకాడుతోందని చురక అంటించారు. నిజంగా అర్హులైన వారిని అభినందించడం మరిచిపోవద్దని, కనీసం నెక్ట్స్ టైమ్ బెటర్ లక్ అంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.