Parvesh Verma: ఢిల్లీ ప్రజలకు ఇదే నా హామీ: 'జెయింట్ కిల్లర్' పర్వేశ్ వర్మ

- ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ను మట్టికరిపించిన పర్వేశ్ వర్మ
- మోదీ, కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఢిల్లీ ప్రభుత్వం పని చేస్తుందన్న వర్మ
- సీఎం ఎవరనే దానిపై పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడి
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అధినేత కేజ్రీవాల్ ను ఓడించిన బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ జెయింట్ కిల్లర్ గా అవతరించారు. సీఎం రేసులో కూడా ఆయన ముందు వరుసలో ఉన్నారు. కేజ్రీవాల్ ను ఓడించిన తర్వాత ఓ జాతీయ మీడియాతో వర్మ మాట్లాడుతూ... ఢిల్లీలో ఏర్పడబోయే బీజేపీ ప్రభుత్వం ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని ప్రజలకు హామీ ఇస్తున్నానని చెప్పారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఢిల్లీని అభివృద్ధిపథంలోకి తీసుకెళుతుందని చెప్పారు.
సీఎం రేసులో ఉన్నారా? అనే ప్రశ్నకు బదులుగా... పార్టీ నాయకత్వం, లెజిస్లేచర్ పార్టీ దీనిపై నిర్ణయం తీసుకుంటుందని పర్వేశ్ వర్మ తెలిపారు. సీఎం ఎవరనేది త్వరలోనే మీకు తెలుస్తుందని చెప్పారు. ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ 27 ఏళ్ల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై పార్టీ హైకమాండ్ ఇప్పటికే దృష్టి సారించింది.