Atishi: ఎన్నికల ఫలితాలు మాకు దెబ్బే... కానీ!: అతిశీ

- ప్రజల తీర్పును గౌరవిస్తున్నామన్న అతిశీ
- నేను గెలిచినా సంబరాలు చేసుకునే సమయం కాదని వ్యాఖ్యలు
- బీజేపీపై పోరాటం కొనసాగుతుందని వెల్లడి
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తమకు దెబ్బేనని, ప్రజల తీర్పును మాత్రం గౌరవిస్తున్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, సౌరబ్ భరద్వాజ్ వంటి కీలక నేతలు ఓటమి చెందారు. ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేతల్లో అతిశీ మాత్రమే విజయం సాధించారు.
కల్కాజీ స్థానం నుండి ఆమె సమీప బీజేపీ అభ్యర్థిపై గెలుపొందారు. తన గెలుపు నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాలు తమకు తీవ్ర నిరాశ కలిగించాయని అన్నారు. ఈ ఎన్నికల్లో తాను గెలిచానని, కానీ సంబరాలు చేసుకునే సమయం మాత్రం కాదన్నారు. తనపై విశ్వాసం ఉంచి గెలిపించిన కల్కాజీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు.