Pawan Kalyan: ఢిల్లీ ఫలితాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏమన్నారంటే...!

- ఈ విజయంతో మోదీపై ప్రజలకు ఉన్న విశ్వాసం మరోసారి రుజువైందన్న పవన్
- 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా మోదీ పాలన కొనసాగిస్తున్నారని ప్రశంస
- మోదీ నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోవడంలో ఢిల్లీ పాత్ర అత్యంత కీలకమన్న జనసేనాని
- డబుల్ ఇంజన్ సర్కార్ తో ఢిల్లీలో సమ్మిళిత అభివృద్ధి, సంక్షేమం క్షేత్ర స్థాయికి చేరతాయని వ్యాఖ్య
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ విజయంతో ప్రధాని నరేంద్ర మోదీపై ప్రజలకు ఉన్న విశ్వాసం మరోసారి రుజువైందని అన్నారు. భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా మోదీ పాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు.
మోదీ నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోవడంలో ఢిల్లీ పాత్ర అత్యంత కీలకమని జనసేనాని పేర్కొన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా దేశ రాజధానిలో సమ్మిళిత అభివృద్ధి, సంక్షేమం క్షేత్ర స్థాయికి చేరతాయని తెలిపారు. ఆర్థిక అవకతవకలకు ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాల అమలు, పరిపాలన సాగుతాయని ఢిల్లీ ప్రజలు విశ్వసించారని పవన్ పేర్కొన్నారు.
హోంమంత్రి అమిత్ షా రాజకీయ అనుభవం, చాతుర్యం సత్ఫలితాలు ఇచ్చాయన్నారు. ఢిల్లీ అభివృద్ధికి, దేశ రాజధాని శ్రేయస్సు, సంక్షేమం కోసం వికసిత సంకల్ప్ పత్రం ద్వారా బీజేపీ ఇచ్చిన హామీలకు ప్రజల మెప్పు ఉందని, నేటి విజయానికి అదే కారణమని పవన్ చెప్పారు. మోదీపై ఢిల్లీ ప్రజలు ఉంచిన విశ్వాసానికి ప్రతీక అక్కడి ఘన విజయం అని పేర్కొన్నారు. ఈ గెలుపులో భాగస్వామ్యులైన వారందరికీ జనసేనాని అభినందనలు తెలియజేశారు.