Arvind Kejriwal: కేజ్రీవాల్‌ను ఓడించిన బీజేపీ నేత... ఎవరీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ?

- కేజ్రీవాల్‌పై 4 వేల పైచిలుకు మెజార్టీతో గెలిచిన పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ
- 2013లో రాజకీయ ఆరంగేట్రం చేసిన పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ
- ఎన్నికలకు ముందు 'రిమూవ్ కేజ్రీవాల్ సేవ్ నేషన్' ప్రచారాన్ని ప్రారంభించిన వర్మ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ ఓడించారు. దీంతో ముఖ్యమంత్రి రేసులో ప్రధానంగా ఆయన పేరు వినిపిస్తోంది. కేజ్రీవాల్, పర్వేశ్ వర్మ మధ్య హోరాహోరీగా కనిపించింది. చివరకు పర్వేశ్ వర్మ 4 వేల పైచిలుకు ఓట్లతో న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి విజయం సాధించారు.
పర్వేశ్ వర్మ 30,088 ఓట్లు, కేజ్రీవాల్ 25,999 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్‌కు కేవలం 4,568 ఓట్లు పడ్డాయి.
పర్వేశ్ వర్మ విజయం సాధించిన తర్వాత, మీడియా ఆయనను పలకరించింది. మీరే ముఖ్యమంత్రి అని ప్రచారం సాగుతోందని మీడియా ప్రశ్నించింది.
స్పందించిన పర్వేశ్ వర్మ, తమ పార్టీ శాసనసభాపక్షం సమావేశమై ముఖ్యమంత్రిని నిర్ణయిస్తుందని వెల్లడించారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా తమకు అంగీకారమే అన్నారు. తనకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తన గెలుపు కోసం శ్రమించిన కార్యకర్తలకు, ప్రధాని నరేంద్రమోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇది నరేంద్ర మోదీ విజయమని వ్యాఖ్యానించారు. ఢిల్లీ ప్రజలు మోదీని పూర్తిగా విశ్వసించారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు.
పర్వేశ్ వర్మ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చారు. ఆయన తండ్రి బీజేపీ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ. ఆయన మరో బంధువు నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా పని చేశారు.
పర్వేశ్ వర్మ 1977లో జన్మించారు. ఆయన ఆర్కేపురం లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదివారు. కిరోరి మాల్ కాలేజీ నుండి బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు.
ఎంబీఏ పట్టభద్రుడైన వర్మ 2013లో రాజకీయ ఆరంగేట్రం చేశారు. మెహ్రాలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి విజయం సాధించారు. 2014లో వెస్ట్ ఢిల్లీ లోక్ సభ స్థానం నుండి గెలిచారు. 2019లో రెండోసారి అదే నియోజకవర్గం నుండి 5.78 లక్షల మెజార్టీతో గెలిచారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, పర్వేశ్ వర్మ 'రిమూవ్ కేజ్రీవాల్-సేవ్ నేషన్' (కేజ్రీవాల్‌ను ఓడిద్దాం-దేశాన్ని రక్షిద్దాం) అనే ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారంలో భాగంగా అతను ఆమ్ ఆద్మీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ముఖ్యంగా, కాలుష్యం, మహిళల రక్షణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలను లేవనెత్తారు.