Gautam Adani: కొడుకు పెళ్లి సందర్భంగా రూ.10 వేల కోట్లు విరాళం ఇచ్చిన అదానీ

- వివాహ బంధంలోకి అడుగుపెట్టిన జీత్ అదానీ
- అహ్మదాబాద్‌లోని అదానీ శాంతిగ్రామ్ టౌన్‌షిప్‌లో దివా జైమిన్ షాను పెళ్లాడిన జీత్
- అత్యంత సన్నిహితుల మధ్య సాదాసీదాగా వివాహ వేడుక
- ఈ సందర్భంగా రూ. 10వేల కోట్లు విరాళంగా ఇచ్చిన గౌతమ్ అదానీ
ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలియనీర్ గౌతమ్ అదానీ కుమారుడు జీత్ అదానీ నిన్న (శుక్రవారం) వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. దివా జైమిన్ షాను ఆయన పెళ్లి చేసుకున్నారు. అహ్మదాబాద్‌లోని అదానీ శాంతిగ్రామ్ టౌన్‌షిప్‌లోని బెల్వెడెరే క్లబ్ ఈ పెళ్లి వేడుకకు వేదికగా నిలిచింది. కేవలం అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా ఈ వివాహ వేడుక జరిగింది.
కాగా, గత నెలలో మహా కుంభమేళాకు వచ్చిన సమయంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తన కుమారుడి వివాహం సాంప్రదాయ పద్ధతిలో చాలా సింపుల్‌గా జరుగుతుందని అన్నారు. అన్నట్టుగానే తన కుమారుడి వివాహాన్ని ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా సాదాసీదాగా జరిపించారు. అంతేగాక రూ. 10వేల కోట్లు విరాళంగా ఇచ్చారు.
ఈ వివాహ నగదు బహుమతిని వివిధ సామాజిక కార్యక్రమాలకు వినియోగించనున్నారు. అందులోనూ ఎక్కువ భాగం ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధిలో భారీ మౌలిక సదుపాయాల కార్యక్రమాలకు నిధులు సమకూర్చడానికి ఉపయోగించనున్నారని సమాచారం.
ఇదిలాఉంటే... పెళ్లికి రెండు రోజుల ముందు గౌతమ్ అదానీ 'మంగళ సేవ' అనే కార్యక్రమాన్ని ప్రకటించారు. దీని ద్వారా ప్రతి ఏడాది 500 మంది దివ్యాంగ మహిళల వివాహానికి ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు విరాళంగా ఇస్తామని తెలిపారు. ఈ మేరకు జీత్, దివా జంట ప్రతిజ్ఞ చేసినట్లు గౌతమ్ అదానీ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు.
ఈ 'మంగళ సేవ' తనకు అపారమైన సంతృప్తిని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ పవిత్ర ప్రయత్నం ద్వారా అనేక మంది వికలాంగులైన ఆడబిడ్డలు, వారి కుటుంబాల జీవితాలు ఆనందం, శాంతి, గౌరవంతో ముందుకు సాగుతాయని గౌతమ్ అదానీ ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా, ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడానికి జీత్ అదానీ బుధవారం నాడు తన నివాసంలో 21 మంది నూతన వధూవరును (వికలాంగ మహిళలు, వారి భర్తలను) కలిసినట్లు గౌతమ్ అదానీ తెలిపారు.