Narendra Modi: మానవ శక్తిని మించింది లేదు... ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ కామెంట్

- ఢిల్లీ బరిలో బీజేపీ విక్టరీ
- సంతోషం వ్యక్తం చేసిన మోదీ
- ఢిల్లీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పాటుపడతామని హామీ
- గర్వించేలా చేశారంటూ బీజేపీకి కార్యకర్తలకు కితాబు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయం దిశగా సాగుతోంది. 27 ఏళ్లుగా ఢిల్లీ పీఠం కోసం ఎదురుచూస్తున్న బీజేపీ... ఈసారి అనుకున్నది సాధిస్తోంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించడం ద్వారా కాషాయదళం ఢిల్లీ గద్దెనెక్కబోతోంది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. మానవశక్తిని మించింది లేదు అంటూ బీజేపీ శ్రేణుల కృషిని కొనియాడారు. అభివృద్ధి గెలిచింది... సుపరిపాలన నెగ్గింది అంటూ ట్వీట్ చేశారు.
"బీజేపీకి చారిత్రాత్మక విజయం అందించిన ఢిల్లీ సోదర సోదరీమణులందరికీ అభివందనాలు, శుభాకాంక్షలు. ఎనలేని ఆశీస్సులు, అపారమైన ప్రేమ అందించిన మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసి ఢిల్లీ సమగ్రాభివృద్ధికి పాటుపడతాం. ఏ ఒక్క అంశాన్ని కూడా విస్మరించకుండా ఢిల్లీ ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తాం. భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మలిచే కార్యక్రమంలో ఢిల్లీ ప్రముఖ పాత్ర పోషిస్తుందని హామీ ఇస్తున్నాను.
ఇంతటి భారీ ప్రజా తీర్పుకు బీజేపీ కార్యకర్తలే కారణం. నా బీజేపీ కార్యకర్తలు రేయింబవళ్లు తీవ్రంగా శ్రమించి ఈ విజయం అందించడం పట్ల గర్విస్తున్నాను. ఇప్పుడు ఢిల్లీ ప్రజలకు సేవ చేసేందుకు మరింత దృఢంగా అంకితమవుతాం" అని ప్రధాని మోదీ తన ట్వీట్ లో వివరించారు.