Sanjay Raut: మహారాష్ట్రలో ఏం చూశామో ఢిల్లీలోనూ అదే కనిపిస్తోంది: సంజయ్ రౌత్

- మహారాష్ట్రలో ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడ్డారన్న సంజయ్ రౌత్
- 5 నెలల్లో 39 లక్షల అక్రమ ఓటర్లను చేర్చారని మండిపాటు
- ఢిల్లీలో కూడా అదే చేశారని ఆరోపణ
- కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేసి ఉంటే ఢిల్లీ ఫలితాలు మరోలా ఉండేవని వ్యాఖ్య
- రెండు పార్టీలకు బీజేపీతో పోటీ అయినప్పుడు... విడివిడిగా ఎందుకు పోటీ చేశారని ప్రశ్న
ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటరు జాబితాలో అవకతవకలు చేసి బీజేపీ గెలిచిందని... ఇప్పుడు ఢిల్లీలో కూడా అదే కనిపిస్తోందని ఆయన అన్నారు. బీజేపీ చేస్తున్న అవకతవకలపై ఎన్నికల సంఘం మౌనంగా ఉంటోందని విమర్శించారు.
ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ వ్యవహారశైలిపై తాము ప్రెస్ మీట్ పెట్టామని... ఓటర్ లిస్ట్ లో జరుగుతున్న ఫ్రాడ్ గురించి, మహారాష్ట్రలో కొత్తగా చోటు చేసుకున్న పరిణామాలపై తాము వివరించామని తెలిపారు. మహారాష్ట్రలో చేసిందే ఢిల్లీలో కూడా చేస్తారని తాను అప్పుడే చెప్పానని అన్నారు.
సీరియస్ ఫ్రాడ్ జరుగుతున్నా ఎలక్షన్ కమిషన్ కళ్లు మూసుకుని కూర్చుందని సంజయ్ రౌత్ విమర్శించారు. మహారాష్ట్రలో 5 నెలల్లో 39 లక్షల అక్రమ ఓటర్లను చేర్చారని... బీహార్ లో, ఢిల్లీలో కూడా ఇదే జరుగుతుందని తాను చెప్పానని తెలిపారు. బీజేపీకి ఓటు వేయాలని ఎవరూ అనుకోరని... ఇదంతా బలవంతపు ఓటింగ్ అని దుయ్యబట్టారు.
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్, ఇండియా కూటమిలోని ఇతర మిత్రపక్షాలు కలిసి పోటీ చేసి ఉంటే... ఎన్నికల ఫలితాలు మరో విధంగా వచ్చి ఉండేవని సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. ఈనాటి ఢిల్లీ ఫలితాల తొలి ట్రెండ్స్ లో గట్టి పోటీ కనపించిందని చెప్పారు. కాంగ్రెస్, ఆప్ కలిసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అన్నారు. ఈ రెండు పార్టీలకు బీజేపీతోనే పోటీ అయినప్పుడు... బీజేపీ అధికారంలోకి రాకుండా కాంగ్రెస్, ఆప్ కలిసి పోరారాడితే బాగుండేదని... అలా చేయకుండా ఎవరికి వారు పోటీ చేశారని విమర్శించారు. కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేసి ఉంటే బీజీపీ ఓటమి తొలి గంటలోనే ఖరారయ్యేదని చెప్పారు.