Karishchandra: ఎందుకు వేషం అడిగానా అని ఏడ్చాను: నటుడు హరిశ్చంద్ర

- మొదటి నుంచి నటన అంటే ఇష్టం
- నాటకాలలో అనుభవం ఉందన్న హరిశ్చంద్ర
- అదే సినిమాల వైపు తీసుకొచ్చిందని వెల్లడి
- అవకాశాలతో పాటు అవమానాలు ఎదురయ్యానని వ్యాఖ్య
చాలాకాలంగా సినిమాలలో నటిస్తూ వస్తున్నా, ఆశించినస్థాయిలో గుర్తింపుకు నోచుకోనివాళ్లు చాలామంది ఉంటారు. అలాంటి నటులలో ఒకరుగా హరిశ్చంద్ర కనిపిస్తాడు. తాజాగా 'ట్రీ మీడియా'వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన గురించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "మాది గుంతకల్లు గ్రామం .. చిన్నప్పటి నుంచి నాటకాలు అంటే ఇష్టం. ఆ తరువాత సినిమాల పట్ల ఆసక్తి పెరుగుతూ వెళ్లింది" అని అన్నాడు.
"1990లలో మా ఫ్యామిలీ హైదరాబాద్ వచ్చింది. ఒక వైపున చిన్న చిన్న పనులు చేసుకుంటూనే, మరో వైపున సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నించడం మొదలుపెట్టాను. అలా తొలిసారిగా 'సర్పయాగం' సినిమాలో తెరపై కనిపించాను. అక్కడి నుంచి చిన్న చిన్న వేషాలతోనే నా ప్రయాణం సాగుతూ వచ్చింది. నేను తెలిసిన కొంతమంది నన్ను ప్రోత్సహిస్తూనే వచ్చారు. తెలియనివాళ్లను కలుస్తూ వెళ్లాను" అని చెప్పారు.
"త్రివిక్రమ్ గారి దగ్గర గతంలో కొంతమంది పనిచేసేవారు. ఒకసారి నేను ఒకతనికి కాల్ చేసి 'సార్ .. ఏదైనా వేషం ఉందా?' అని అడిగాను. 'ఏమనుకుంటున్నావయ్యా నువ్వు .. పదిసార్లు కాల్ చేసి విసిగిస్తావేంటి? సినిమా అంతా నువ్వే ఉంటావా? నిన్ను పెట్టి సినిమా తీయమంటావా? నువ్వి ఇట్లా చేస్తే ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను" అని అన్నాడు. అప్పుడు మాత్రం నేను చాలా హర్ట్ అయ్యాను. ఇదంతా అవసరమా మనకు అనుకుని ఏడ్చాను. నా లైఫ్ లో నేను ఎక్కువగా బాధపడిన సంఘటన ఇదే" అని చెప్పాడు.