Chandrababu: మహారాష్ట్రలో పవన్, ఢిల్లీలో చంద్రబాబు... ఉత్తరాదిలో కూటమి నేతల హవా!

- మహారాష్ట్ర ఎన్నికల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రచారం
- అక్కడ మహాయుతి కూటమి విజయం
- తాజాగా ఢిల్లీలో సీఎం చంద్రబాబు కాషాయం పార్టీ తరఫున క్యాంపెయిన్
- ఇప్పుడు దేశ రాజధానిలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకెళుతున్న బీజేపీ
- దీంతో కూటమి నేతల హవా ఉత్తరాదిలో కూడా పని చేసిందంటున్న రాజకీయ విశ్లేషకులు
ఉత్తరాదిలో ఏపీ కూటమి నేతల హవా కొనసాగుతోంది. మొన్న మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రచారం చేయగా, అక్కడ బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. నిన్న ఢిల్లీలో సీఎం చంద్రబాబు కాషాయం పార్టీ తరఫున ప్రచారం చేయగా... ఇప్పుడు బీజేపీ భారీ ఆధిక్యంతో ప్రభుత్వం ఏర్పాటు దిశగా దూసుకెళుతోంది. దీంతో మన నేతల హవా ఉత్తరాదిలో కూడా పని చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమికి మద్దతుగా గతంలో జనసేనాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా లాతూర్, షోలాపూర్, పుణే, డెగ్లూర్, బల్లార్ పూర్ లలో ప్రచారం చేశారు. ఆయన క్యాంపెయిన్ నిర్వహించిన నియోజకవర్గాల్లో మహాయుతి కూటమి విజయఢంకా మోగించింది.
ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున సీఎం చంద్రబాబు ప్రచారం చేశారు. ప్రధానంగా తెలుగు వాళ్లు ప్రభావితం చేసే నియోజకవర్గాలలో ఆయన పర్యటించారు. చంద్రబాబు క్యాంపెయిన్ చేసిన సహద్ర, షాదారా, సంగం విహార్, విశ్వాస్ నగర్ వంటి ప్రాంతాల్లో కాషాయ పార్టీ లీడింగ్‌లో కొనసాగుతోంది. కాగా, ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో బంపర్ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.