Sheesh Mahal: ఆమ్ ఆద్మీని ముంచేసిన ఆ రెండు కారణాలు..!

- ఆప్ ఓటమికి లిక్కర్ స్కామ్ కారణమంటున్న విశ్లేషకులు
- శీష్ మహల్ పై ఆరోపణలూ ఓ కారణమని వెల్లడి
- అడ్డగోలుగా హామీలు ఇచ్చినా కేజ్రీవాల్ ను నమ్మని ఢిల్లీ ఓటర్లు
అవినీతి రహిత రాజకీయాలనే నినాదంతో ఎంట్రీ ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీని అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడమే ప్రస్తుత వైఫల్యానికి కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడిగా కేజ్రీవాల్ పై ఆరోపణలు రావడం ఆప్ కు భారీగా నష్టం చేసిందని చెబుతున్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో దారుణమైన ఓటమి దిశగా ఆప్ పయనిస్తుండడం వెనక ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇందులో ఒకటి లిక్కర్ స్కాంలో ఆప్ నేతలు జైలుకు వెళ్లడం కాగా శీష్ మహల్ పునర్నిర్మాణం కోసం భారీ మొత్తంలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు రెండో కారణమని అభిప్రాయపడుతున్నారు.
2013లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావం దేశ రాజకీయాల్లోనే ఓ సంచలనమని విశ్లేషకులు చెబుతున్నారు. తొలి ఎన్నికల్లో పూర్తి మెజారిటీ రాకపోయినా కాంగ్రెస్ పరోక్ష సహకారంతో ఢిల్లీ ముఖ్యమంత్రి సీటులో కేజ్రీవాల్ కూర్చోగలిగారు. అవినీతికి వ్యతిరేకంగా ఏర్పాటైన పార్టీ కావడంతో ఢిల్లీ ఓటర్లు కేజ్రీవాల్ కు పట్టం కట్టారు. 2015లో జరిగిన ఉప ఎన్నికల్లో ఢిల్లీలోని 70 సీట్లకు గాను 67 సీట్లను ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకోవడమే దీనికి నిదర్శనమని చెప్పారు. 2020 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆప్ 62 స్థానాలను గెలుచుకున్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. అయితే, అవినీతికి వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడాన్ని ఢిల్లీ ఓటర్లు జీర్ణించుకోలేకపోయారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆప్ చీఫ్ కేజ్రీవాల్ సహా పార్టీ కీలక నేతలు జైలుపాలవడం పార్టీపై ప్రజలకు ఉన్న విశ్వసనీయతను దెబ్బతీసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదేవిధంగా, తాను సామాన్యుడినని, ఆడంబరాలకు, ఆర్భాటాలకు దూరంగా ఉంటానని పదే పదే వ్యాఖ్యానించే కేజ్రీవాల్ తన అధికారిక భవనం శీష్ మహల్ మరమ్మతుల కోసం భారీ మొత్తంలో ప్రభుత్వ నిధులను వినియోగించారనే ఆరోపణలు కూడా ఓటర్లను ప్రభావితం చేశాయని భావిస్తున్నారు. ఈ రెండు అంశాలను బీజేపీ నేతల తమ ప్రచారంలో హైలైట్ చేసి ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.