BJP: ఢిల్లీ సీఎం రేసులో వినిపిస్తున్న పేర్లు ఇవే..!

- 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న బీజేపీ
- ఫలితాల ట్రెండ్ లో స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తున్న కమలం పార్టీ
- ముఖ్యమంత్రి రేసులో బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమేనని ఫలితాల ట్రెండ్ వెల్లడిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాలు వెలువడుతుండడంతో బీజేపీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. దేశ రాజధానిలో 27 ఏళ్ల తర్వాత అధికారంలోకి రానుండడంతో నాయకుల్లో జోష్ నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేసులో ప్రధానంగా ముగ్గురి పేర్లు చర్చకు వస్తున్నాయి. ఇందులో బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవా ముందంజలో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో ఎంపీ మనోజ్ తివారీ, పర్వేశ్ వర్మ, రమేశ్ బిధూరి కూడా సీఎం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. మనోజ్ తివారీ, వీరేంద్ర సచ్‌దేవా, పర్వేశ్ వర్మలలో ఒకరిని సీఎంగా, మిగతా ఇద్దరినీ డిప్యూటీ సీఎంలుగా ఎంపిక చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 36 సీట్లు కాగా బీజేపీ ప్రస్తుతం 48 శాతం ఓట్ షేర్ తో 41 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఆప్ 43 శాతం ఓట్ షేర్ తో 29 స్థానాల్లో లీడ్ ల్ ఉంది. న్యూఢిల్లీ నియోజకవర్గంలో హోరాహోరీ పోరు కొనసాగుతోంది. రౌండ్ రౌండ్ కూ ఆధిక్యం మారుతోంది. ఇక్కడ ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్, బీజేపీ తరఫున పర్వేశ్ వర్మ పోటీ పడుతున్నారు. స్వల్ప ఆధిక్యంతో ఒక్కో రౌండ్ కు ఒక్కో అభ్యర్థి లీడ్ లోకి వస్తున్నారు.