Omar Abdullah: ఢిల్లీ ఫలితాల ట్రెండ్ పై ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

Omar Abdullahs Jab Appears To Aim At INDIA Allies AAP And Congress

  • కాంగ్రెస్, ఆప్ తీరుపై మండిపడ్డ జమ్మూకశ్మీర్ సీఎం
  • ఇండియా కూటమి పార్టీలపై విమర్శలు
  • మనలో మనం కొట్లాడుకుంటే ఫలితాలు ఇలాగే వస్తాయంటూ ఫైర్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దూసుకుపోతుండడంపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ పార్టీల అగ్ర నాయకత్వంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ‘మీలో మీరు మరింత పోట్లాడుకోండి, ఒకరినొకరు ఓడించుకోండి’ అంటూ ఎద్దేవా చేశారు. ఈమేరకు ఒమర్ అబ్దుల్లా సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటైన ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఆప్ తో పాటు పలు ప్రాంతీయ పార్టీలు భాగస్వాములుగా ఉన్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ కూటమిలోని పార్టీల్లో విభేదాలు పొడసూపాయి.

కాంగ్రెస్ పార్టీ వైఖరిపై ఆప్ విమర్శలు గుప్పించగా, కాంగ్రెస్ కూడా అదే రీతిలో ప్రతిస్పందించింది. ఒకే కూటమిలో ఉన్నప్పటికీ ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ వేర్వేరుగా పోటీ చేశాయి. సీట్ల సర్దుబాటు విషయంలో అభిప్రాయభేదాలే దీనికి కారణమని పార్టీ వర్గాలు వెల్లడించాయి. విడివిడిగా పోటీ చేయడం వల్ల కాంగ్రెస్, ఆప్ పరస్పరం విమర్శలు చేసుకోవడం రెండు పార్టీలకు నష్టం కలిగించిందని, ఇండియా కూటమిలో ఐకమత్యం లేకపోవడం బీజేపీకి లాభించిందని ఒమర్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆప్, కాంగ్రెస్ ల తీరుపై మండిపడుతూ.. మనలో మనం కొట్లాడుకుంటే ఫలితాలు ఇలాగే వస్తాయంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

  • Loading...

More Telugu News