Delhi Elections: కేజ్రీవాల్ సహా ఆప్ కీలక నేతల వెనుకంజ

- కల్కాజీ నియోజకవర్గంలో వెనుకబడ్డ సీఎం అతిశీ
- న్యూఢిల్లీలో కేజ్రీవాల్ పై బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ లీడ్
- ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో దూసుకుపోతున్న బీజేపీ
దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వెనుకబడింది. పార్టీ నేషనల్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో పాటు కీలక నేతలంతా వెనుకంజలో ఉన్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్ వరుసగా మూడోసారి ఇప్పుడు పోటీ పడగా.. బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ ఇక్కడ లీడ్ లో కొనసాగుతున్నారు. కల్కాజీ నియోజకవర్గం బరిలో నిలిచిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కీలక నేత అతిశీ మార్లేనా కూడా వెనుకంజలోనే ఉన్నారు. జంగ్ పుర నుంచి పోటీ చేసిన మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కూడా వెనుకంజలోనే ఉన్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ లీడ్ లో కొనసాగుతున్నారు.
షాకూర్ బస్తీ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గ్రేటర్ కైలాష్ లో ఆప్ అభ్యర్థి సౌరబ్ భరద్వాజ్ 500 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది. మ్యాజిక్ ఫిగర్ 36 స్థానాలకు పైనే బీజేపీ అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. ప్రస్తుతం 50 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు లీడ్ లో ఉండగా.. ఆప్ అభ్యర్థులు 19 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నారు. ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది.