Naga Chaitanya: 'తండేల్' హిట్ కావడంపై నాగచైతన్య స్పందన

- ఇంత పాజిటివిటీ చూసి ఎంతో కాలం అయ్యిందన్న నాగ చైతన్య
- తాను మిస్ అయ్యింది మళ్లీ తిరిగి వచ్చిందని వ్యాఖ్య
- ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడాలంటూ ఆకాంక్ష
నాగ చైతన్య హీరోగా దర్శకుడు చందూ మొండేటి రూపొందించిన తాజా చిత్రం ‘తండేల్’కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ‘తండేల్’ విజయం పట్ల హీరో నాగ చైతన్య హర్షం వ్యక్తం చేశారు.
చిత్రం విజయోత్సవ వేడుక అనంతరం నాగ చైతన్య మీడియాతో మాట్లాడుతూ, సినిమాను ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఎన్నో సందేశాలు, ఫోన్ కాల్స్ వచ్చాయని ఆయన అన్నారు. చిత్రం విజయం పట్ల చాలా ఆనందంగా ఉందని, ఇంతటి సానుకూల స్పందన చూసి ఎంతో కాలం అయిందని ఆయన పేర్కొన్నారు. తాను ఇంతకాలం మిస్ అయిన అనుభూతి మళ్లీ తిరిగి వచ్చిందన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా ఎక్కువ మంది థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలని ఆయన ఆకాంక్షించారు.
కుటుంబ ప్రేక్షకులు ఆదరించే అంశాలు ఈ చిత్రంలో చాలా ఉన్నాయని ఆయన అన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తే ఈ సినిమాకు మరింత మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. తనకు వస్తున్న ప్రశంసల్లో సగం సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌కే దక్కుతాయని, ఆయన అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారని కొనియాడారు. తనను నమ్మి ఈ సినిమాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు నాగ చైతన్య ధన్యవాదాలు తెలియజేశారు.