Arvind Kejriwal: బీజేపీపై ఆరోపణలు... ఫలితాలకు ముందురోజు కేజ్రీవాల్‌కు ఏసీబీ నోటీసులు

- తమ పార్టీ అభ్యర్థులకు బీజేపీ ఎరవేస్తోందని కేజ్రీవాల్ ఆరోపణ
- ఎల్జీ ఆదేశాలతో విచారణ జరుపుతున్న ఏసీబీ
- ఆరోపణలకు ఆధారాలు చూపాలంటూ నోటీసుల్లో పేర్కొన్న ఏసీబీ
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. రేపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులను బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ స్పందిస్తూ విచారణ జరపాలని ఆదేశించారు.
కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై విచారణ ప్రారంభించిన ఏసీబీ, ఆయనకు నోటీసులను పంపింది. ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.
పార్టీ మారేందుకు పదహారు మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు బీజేపీ లంచాలు ఇవ్వజూపిందంటూ కేజ్రీవాల్ ఎక్స్‌లో చేసిన పోస్టును ఏసీబీ ప్రస్తావించింది. ఆ ట్వీట్ మీరే చేశారా? అని కేజ్రీవాల్‌ను ప్రశ్నించింది. ఈ ఆరోపణలకు సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలని కోరింది.
ఫోన్ కాల్ అందుకున్న ఆ పదహారు మంది అభ్యర్థులు ఎవరు? వారి ఫోన్ నెంబర్లు ఏమిటి? వారికి ఏ నెంబర్ల నుండి ఫోన్లు వచ్చాయి? వంటి వివరాలను అందజేయాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఢిల్లీ ప్రజల్లో ఆందోళనలు రేకెత్తించేలా ఆరోపణలు చేస్తున్నందున చట్టపరంగా చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ప్రశ్నించింది.
ఇదిలా ఉండగా, ఏసీబీ అధికారుల బృందం ఢిల్లీలోని ఫిరోజ్‌షా రోడ్డులో ఉన్న కేజ్రీవాల్ నివాసానికి విచారణ నిమిత్తం వెళ్లింది. కేజ్రీవాల్ నివాసానికి ఏసీబీ అధికారులు రావడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు నిరసించారు. ఏసీబీ అధికారులు లోనికి వెళ్లకుండా అడ్డుకోవడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.