Sharmila: ఇదీ... జగన్ మోహన్ రెడ్డి మహోన్నతమైన క్యారెక్టర్: షర్మిల

- ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పిన విజయసాయిరెడ్డి
- కొన్నిరోజుల కిందట షర్మిలతో భేటీ
- విజయసాయిరెడ్డితో సమావేశంపై షర్మిల స్పందన
- అబద్ధాలు చెప్పాలని విజయసాయిపై జగన్ ఒత్తిడి తెచ్చారని వెల్లడి
- అబద్ధాలు ఎలా చెప్పాలో జగన్ చెబితే విజయసాయి రాసుకున్నారని వివరణ
ఇటీవలే వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి ఇంకా ఏ పార్టీలో చేరలేదు. తాను రాజకీయాలకు దూరం అని ప్రకటించినప్పటికీ, ఇటీవల ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలతో ఆయన భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా, ఈ సమావేశంపై షర్మిల స్పందించారు.
విజయసాయిరెడ్డితో చాలా విషయాలు మాట్లాడామని ఆమె పేర్కొన్నారు. జగన్ వల్ల పడిన ఇబ్బందులను ఆయన చెప్పారని వెల్లడించారు. ఆయన ఏం చెప్పారనే దాని కంటే... నా బిడ్డలకు సంబంధించిన విషయం మాత్రం నేను చెబుతా అని షర్మిల స్పష్టం చేశారు. షేర్లు తనకే చెందాలంటూ నా పైనా, నా తల్లి పైనా కేసు వేశారని జగన్ పై ఆరోపణలు చేశారు.
"అందుకే నాడు వైఎస్సార్ ఏమన్నారో ఆ విషయాలనే నేను చెప్పాల్సి వచ్చింది. కానీ విజయసాయిరెడ్డితో జగనే ప్రెస్ మీట్ పెట్టించి నా మాటలు అబద్ధాలు అని చెప్పించారు. కొంచెం టైమ్ ఇవ్వండి సర్... నేను కూడా కొంచెం ఆలోచించుకోవాలి అని విజయసాయిరెడ్డి చెప్పినా జగన్ ఒప్పుకోలేదట. ఆ తర్వాత సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి మాటలు అబద్ధమని అమ్మ విజయమ్మ లేఖ రాసి చెప్పారు. ఆ తర్వాత కూడా విజయసాయిరెడ్డిపై జగన్ ఒత్తిడి తెచ్చారంట. విజయసాయిరెడ్డి అందుకు అంగీకరించకపోతే సుబ్బారెడ్డితో మాట్లాడించారు.
వైఎస్సార్ బిడ్డ, తోడబుట్టిన చెల్లి అని కూడా చూడకుండా జగన్ దిగజారిపోయారు... నా క్యారెక్టర్ గురించి నీచంగా మాట్లాడించారు. క్యారెక్టర్ గురించి ఇటీవల కొత్త ఫిలాసఫీ చెప్పిన జగన్... క్యారెక్టర్ అనే పదానికి అర్థం ఏంటో మరిచిపోయారు. తన క్యారెక్టర్ ఏంటో జగనే ఆలోచన చేయాలి.
వైఎస్సార్ కోరికకు భిన్నంగా అబద్ధం చెప్పాలని విజయసాయిరెడ్డిపై ఒత్తిడి తెచ్చారు. విజయమ్మ గారికి అన్నీ తెలుసు... నేను అబద్ధాలు చెప్పిన విషయం ఆమె గుర్తిస్తుంది... పరువు పోతుంది... వదిలేయండి అన్నా జగన్ ఊరుకోలేదు. ఏ అబద్ధాలు ఎలా చెప్పాలో జగన్ 40 నిమిషాలు డిక్టేట్ చేస్తే విజయసాయిరెడ్డి రాసుకున్నారంట... ఏ అబద్ధాన్ని ఎంత అందంగా చెప్పాలి అని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి డిక్టేషన్ ఇచ్చారట... ఇదీ, జగన్ మోహన్ రెడ్డి మహోన్నతమైన క్యారెక్టర్!
మేనకోడలు, మేనల్లుడి ఆస్తులు కాజేయాలని కుట్రలు చేసిన వ్యక్తి జగన్. జగన్ నైజం ఎలాంటిదో నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను కాబట్టి... విజయసాయిరెడ్డి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యం కలిగించలేదు. రాజశేఖర్ రెడ్డి కొడుకై ఉండి జగన్ ఇంతలా క్యారెక్టర్ దిగజార్చుకోవడం అవసరమా అనిపించింది. ఇద్దరు బిడ్డలకు ఆస్తుల్లో సమానమైన వాటా ఉండాలని జగన్ కు, ఆయన భార్యకు తెలిసిన విషయమే. సొంత తల్లిపైనే కేసు పెట్టారు. జగన్, ఆయన భార్య బైబిల్ ముందు పెట్టుకుని వారి క్యారెక్టర్ ఏంటో, ఎంత దిగజారిపోయారో ఆత్మపరిశీలన చేసుకోవాలి" అంటూ షర్మిల వ్యాఖ్యానించారు.