Telangana: ఆర్టీసీ కార్మికులను చర్చలకు ఆహ్వానించిన తెలంగాణ ప్రభుత్వం

- సమ్మెకు దిగుతామని టీజీఎస్ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసు
- 21 డిమాండ్లతో నోటీసులు ఇచ్చిన ఆర్టీసీ జేఏసీ
- ఈ క్రమంలో 10వ తేదీ సాయంత్రం చర్చలకు రావాలని ఆహ్వానం
ఈ నెల 10వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు చర్చలకు హాజరు కావాల్సిందిగా ఆర్టీసీ యాజమాన్యాన్ని, ఆర్టీసీ జేఏసీని ప్రభుత్వం ఆహ్వానించింది. తమ డిమాండ్లు నెరవేర్చని పక్షంలో ఫిబ్రవరి 9వ తేదీ లేదా ఆ తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగుతామని టీజీఎస్ఆర్టీసీ జేఏసీ గత నెల 27న బస్ భవన్‌లో ఆపరేషన్స్ ఈడీకి సమ్మె నోటీసును అందజేసింది. 21 డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసును అందజేయడంతో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది.
ఈ మేరకు కార్మిక శాఖ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. సమస్యల పరిష్కారానికి చర్చలకు ఆహ్వానించినట్లు కార్మిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని, రెండు పీఆర్సీలను అమలు చేయాలని, 2021 వేతన సవరణను అమలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలని, ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీయే కొనుగోలు చేసి నడపాలని, ఇలా మొత్తం 21 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది.