Nagarjuna: ఏఎన్నార్ ఘనతలను ప్రధాని పొగుడుతుంటే అమితానందం కలిగింది: నాగార్జున

- ప్రధాని మోదీని కలిసిన నాగ్ ఫ్యామిలీ
- మోదీకి జ్ఞాపిక బహూకరించిన నాగార్జున
- మోదీని కలవడంపై ట్వీట్
టాలీవుడ్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున ఇవాళ కుటుంబ సమేతంగా వెళ్లి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. నాగార్జున, అమల, నాగచైతన్య, శోభిత మోదీని కలిశారు. దీనిపై నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
ఏఎన్నార్ ఘనతలను ప్రధాని మోదీ అభినందిస్తుంటే అమితానందం కలిగిందని పేర్కొన్నారు. ఏఎన్నార్ దాతృత్వ వారసత్వాన్ని... అన్నపూర్ణ స్టూడియోస్, అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా సంస్థల స్థాపన వెనుక ఆయన కృషిని ప్రధాని మోదీ ప్రశంసించడం గొప్ప అనుభూతిని కలిగించిందని నాగ్ వివరించారు. ఇంతటి గౌరవం లభించడంతో మా హృదయాలు గర్వంతోనూ, కృతజ్ఞతాభావంతోనూ నిండిపోయాయి అని ట్వీట్ చేశారు.
ఈ మేరకు ప్రధాని మోదీని కలిసిన ఫొటోను కూడా నాగార్జున పంచుకున్నారు. కాగా, మోదీకి అక్కినేని ఫ్యామిలీ తరఫున నాగార్జున ఓ జ్ఞాపికను బహూకరించారు.
