MVV Satyanarayana: వైసీపీ మాజీ ఎంపీ ఈవీవీ ఆస్తులను సీజ్ చేసిన ఈడీ

- హయగ్రీవ ఫామ్స్ కు చెందిన రూ. 44.74 కోట్ల ఆస్తుల సీజ్
- ప్లాట్లు అమ్మి రూ. 150 కోట్లు ఆర్జించారన్న ఈడీ
- 12.51 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారని తేల్చిన ఈడీ
వైసీపీ విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు ఈడీ షాక్ ఇచ్చింది. హయగ్రీవ ఫామ్స్ కు చెందిన రూ. 44.74 కోట్ల ఆస్తులను సీజ్ చేసింది. ఈ భూముల అమ్మకాల్లో ఎంవీవీ, ఆయన ఆడిటర్ జీవీ, మేనేజింగ్ పార్ట్ నర్ గద్దె బ్రహాజీలు సూత్రధారులుగా తేల్చింది. హయగ్రీవ ఫామ్స్ లో ప్లాట్లు అమ్మి దాదాపు రూ. 150 కోట్లు సంపాదించారని ఈడీ తెలిపింది. గత ఏడాది అక్టోబర్ లో ఎంవీవీ, జీవీ ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
అనాథలు, వృద్ధులకు సేవ చేయడానికి కేటాయించిన భూములను వీరు ఆక్రమించుకున్నట్టు ఈడీ తేల్చింది. ఎండాడలోని హయగ్రీవ ప్రాజెక్ట్ కు చెందిన 12.51 ఎకరాల భూమిని బలవంతంగా లాక్కున్నారని ఆరోపిస్తూ గత ఏడాది జూన్ 22న అరిలోవ పోలీస్ స్టేషన్ లో చిలుకూరు జగదీశ్వరుడు, ఆయన భార్య రాధారాణి ఫిర్యాదు చేశారు. అక్కడ నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ రంగంలోకి దిగి దర్యాప్తు జరిపింది. చివరకు ఎంవీవీ ఆస్తులను జప్తు చేసింది.