Arvind Kejriwal: ఆప్ అభ్యర్థులను కొనే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న కేజ్రీవాల్... విచారణకు ఎల్జీ ఆదేశం

- రేపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
- ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ
- తమ అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేస్తున్నారన్న కేజ్రీవాల్
- బీజేపీలోకి వస్తే మంత్రి పదవి, రూ.15 కోట్లు ఆఫర్ చేస్తున్నారని ఆరోపణ
రేపు (ఫిబ్రవరి 8) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో, అందరి దృష్టి అటువైపే ఉంది. ఈ నేపథ్యంలో, కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫలితాల వెల్లడికి ముందే తమ అభ్యర్థులను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు.
తమ అభ్యర్థులకు బీజేపీ నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని, బీజేపీలోకి వస్తే మంత్రి పదవులు ఆఫర్ చేస్తున్నారని కేజ్రీవాల్ తెలిపారు. 16 మంది ఆప్ అభ్యర్థులకు ఇలాంటి ఆఫర్ లు వచ్చాయని వివరించారు. ఒక్కొక్కరికి రూ.15 కోట్ల చొప్పున ఇస్తామని కూడా ప్రలోభపెడుతున్నారని వెల్లడించారు. ఆప్ ను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.
కేజ్రీవాల్ ఆరోపణలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంలో నిగ్గు తేల్చాలంటూ ఆయన ఏసీబీని ఆదేశించారు. అటు, ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ఆరోపణలపై బీజేపీ స్పందించింది. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వం చేస్తున్న ఆరోపణలు పరువునష్టం కలిగించే విధంగా ఉన్నాయని మండిపడింది. తమ పార్టీ ప్రతిష్ఠను కించపరిచేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.