HYDRA: శంషాబాద్‌లో అక్రమ హోర్డింగ్‌లను తొలగించిన హైడ్రా అధికారులు

- బెంగళూరు జాతీయ రహదారికి అనుకొని ఇరువైపుల హోర్డింగుల ఏర్పాటు
- మున్సిపల్ అధికారులతో కలిసి తొలగించిన హైడ్రా
- అక్రమ డంపింగ్‌పైనా కఠినంగా వ్యవహరించాలని హైడ్రా నిర్ణయం
రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా అధికారులు అక్రమ హోర్డింగులను తొలగించారు. బెంగళూరు జాతీయ రహదారికి ఇరువైపులా అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన హోర్డింగులను మున్సిపల్ అధికారులతో కలిసి హైడ్రా తొలగించింది.
శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 17 హోర్డింగ్‌లను అనుమతి లేకుండా ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. మున్సిపల్ అధికారులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా రంగంలోకి దిగి వాటిని తొలగించింది. అక్రమ హోర్డింగ్‌లపై చర్యలు కొనసాగుతాయని హైడ్రా అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా, నిర్మాణ రంగ వ్యర్థాలు, ఇతర వ్యర్థాలను అక్రమంగా డంప్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైడ్రా నిర్ణయించింది. చెరువులు, నాలాలు, ఖాళీ స్థలాల్లో వ్యర్థాలు పోసే వాహనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. అక్రమంగా వ్యర్థాలు డంప్ చేస్తున్న నాలుగు టిప్పర్లను హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు సీజ్ చేశాయి.