Jaspreet Bumrah: ముగిసిన వైద్య పరీక్షలు... తేలనున్న బుమ్రా భవితవ్యం

- ఆస్ట్రేలియా పర్యటనలో గాయనపడిన బుమ్రా
- ఇంగ్లండ్ తో మూడో వన్డేకి బుమ్రాను ఎంపిక చేసిన సెలెక్టర్లు
- ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో గాయం నుంచి కోలుకుంటున్న బుమ్రా
టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడడం తెలిసిందే. ఇప్పుడతడి గాయంపై అనిశ్చితి నెలకొంది. ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ లో మూడో వన్డేలో ఆడే టీమిండియాకు బుమ్రాను ఎంపిక చేశారు. అయినప్పటికీ, ఆ మ్యాచ్ లో అతడు ఆడేది అనుమానంగా మారింది.
ప్రస్తుతం బుమ్రా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో గాయం నుంచి కోలుకుంటున్నాడు. అతడికి స్కానింగ్ సహా ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు. తొలుత బుమ్రా గాయానికి జనవరిలో ఒక స్కానింగ్ తీశారు. తాజాగా మరో స్కానింగ్ తీశారు. ఆ నివేదికలు వస్తే బుమ్రా భవితవ్యం తేలనుంది. బుమ్రా మెడికల్ రిపోర్ట్స్ ను న్యూజిలాండ్ కు చెందిన ప్రఖ్యాత వైద్య నిపుణుడు డాక్టర్ రోవన్ స్కౌటెన్ పరిశీలించనున్నారు.
కాగా, ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఇలాంటి మెగా టోర్నీలో బుమ్రా వంటి కీలకమైన పేసర్ లేకుండా బరిలో దిగడం జట్టు అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో, బుమ్రా వైద్య పరీక్షల నివేదికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.