Maha Kumbh 2025: కుంభమేళాలో పాక్ హిందువులు... ఈ ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు!

- యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా
- దేశ విదేశాల నుంచి క్యూ కడుతున్న భక్తులు
- పాకిస్థాన్ నుంచి కుంభమేళాకు వచ్చిన 68 మంది హిందువులు
- హిందు మతం గొప్పతనాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునే అవకాశం దక్కిందని వ్యాఖ్య
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు క్యూ కడుతున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు దాయాది పాకిస్థాన్ నుంచి 68 మంది హిందువులు కూడా ప్రయాగ్‌రాజ్ వచ్చారు.
త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అనంతరం అక్కడి ఘాట్‌లలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము సింధ్ ప్రావిన్స్ నుంచి వచ్చామని చెప్పారు. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే ఈ పవిత్ర సందర్భాన్ని మిస్ చేసుకోకూడదనే ఉద్దేశంతో ఇండియాకు వచ్చినట్లు తెలిపారు.
ఈ మహత్తర కార్యక్రమం ద్వారా హిందు మతం గొప్పతనాన్ని తొలిసారిగా మరింత లోతుగా అర్థం చేసుకునే అవకాశం దక్కిందన్నారు. హరిద్వార్ వెళ్లి తమ పూర్వీకుల అస్థికల్ని గంగలో కలిపామని వారు చెప్పారు. ఈ ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉందంటూ పాక్ హిందువులు హర్షం వ్యక్తం చేశారు.
కాగా, గత నెల 13న ప్రారంభమైన మహా కుంభమేళా ఈ నెల 26 వరకు జరగనుంది. 45 రోజుల పాటు జరిగే కుంభమేళాకు దాదాపు 40 కోట్ల మంది వరకు భక్తులు రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ఇప్పటికే 30 కోట్లకు పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు యూపీ సర్కార్ వెల్లడించింది.