HYDRA: ఓవరాక్షన్ చేయొద్దు: హైకోర్టు న్యాయవాదికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరిక

- అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని రాజగోపాల్ నగర్‌లో పర్యటించిన రంగనాథ్
- బాధితుల సమస్యలు వింటుండగా జోక్యం చేసుకున్న హైకోర్టు న్యాయవాది ముఖీం
- మీరు ఓవరాక్షన్ చేయవద్దని హైడ్రా కమిషనర్ హెచ్చరిక
ప్లాట్ల విషయంలో కొనుగోలుదారులను కొందరు భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. రెండు వారాల్లో లోతుగా పరిశీలించి ఇరువర్గాలు చెప్పింది వింటామని, అదే సమయంలో కోర్టు పరిధిలో ఉన్న అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని రెండు నెలల్లో సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.
రంగనాథ్ ఈరోజు అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఐలాపూర్‌లో గల రాజగోపాల్ నగర్‌లో పర్యటించారు. తమ ప్లాట్లను కొంతమంది కబ్జా చేస్తున్నారంటూ రాజగోపాల్ నగర్ ప్లాట్స్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదుతో ఆయన పర్యటించారు. ఈ నేపథ్యంలో ఐలాపూర్‌లో పర్యటించిన రంగనాథ్ బాధితుల సమస్యలను విన్నారు.
ఇరువురి మధ్య వాదన
రాజగోపాల్ నగర్ అసోసియేషన్ సభ్యులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశమయ్యారు. రంగనాథ్ బాధితుల సమస్యలు వింటున్న సమయంలో హైకోర్టు న్యాయవాది ముఖీం జోక్యం చేసుకున్నారు. న్యాయవాది ముఖీం, 'మీకు తెలుగు వచ్చా' అని హైడ్రా కమిషనర్‌ను అడిగారు. కోర్టు పరిధిలో ఉన్న దానిని చూసేందుకు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఓవర్ యాక్షన్ చేయవద్దని న్యాయవాదిని రంగనాథ్ హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయింది.
వారిని ముందు పెట్టి కబ్జా చేశారనే ఆరోపణ: రంగనాథ్
రాజగోపాల్ నగర్‌లో 40 ఏళ్ల క్రితం ప్లాట్లు కొనుగోలు చేశామని, కానీ కొంతమంది వచ్చి ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు ప్రజావాణిలో హైడ్రాకు ఫిర్యాదు చేశారని రంగనాథ్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీలను ముందు పెట్టి ముఖీం అనే న్యాయవాది దీనిని కబ్జా చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయన్నారు. కానీ 1980లలో ప్లాట్లు కొన్న వారిలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలు, పేదవారు ఉన్నారని రంగనాథ్ వెల్లడించారు. కరోనా సమయంలో తాము కట్టుకున్న ఇళ్లను కూలగొట్టారని బాధితులు ఆరోపించారని తెలిపారు. ఈ అంశానికి సంబంధించి వాస్తవాలు తెలుసుకోవడానికి తాము ఇక్కడకు వచ్చామన్నారు.