Jayasheela: ఆయన చనిపోవడానికి నేను కారణం కాదు: సీనియర్ నటి జయశీల

- నటిగా 600 సినిమాలు చేసిన జయశీల
- అప్పటి ఇండస్ట్రీలోని వాతావరణమే వేరని వ్యాఖ్య
- తాను ఎవరి ఆస్తులను దోచుకోలేదని వెల్లడి
- తనకే అన్యాయం జరిగిందని ఆవేదన
ఒకప్పుడు వ్యాంప్ తరహా పాత్రలను ఎక్కువగా ధరించిన 'జయశీల' చాలామందికి గుర్తుండే ఉంటారు. 600 సినిమాల వరకూ చేసిన ఆమె, కొన్ని పాత్రల ద్వారా ప్రేక్షకులను ప్రభావితం చేశారు. అలాంటి జయశీల తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన గురించిన అనేక విషయాలను పంచుకున్నారు. " మంచి కుటుంబం నుంచి నేను ఇండస్ట్రీకి వచ్చాను. పెద్ద పెద్ద ఆర్టిస్టులతో కలిసి పనిచేశాను. చెన్నై లో ఇండస్ట్రీ ఉన్నప్పుడు చాలా బాగుండేది. అందరం ఆప్యాయంగా పలకరించుకునేవాళ్లం. హైదరాబాదులో ఆ వాతావరణం లేదు" అన్నారు.
"నేను ఇండస్ట్రీలో బిజీ అవుతున్న సమయంలో ఒక కేసు విషయంలో ఒక పోలీస్ ఆఫీసర్ తారసపడ్డారు. పెళ్లి చేసుకుంటానని చాలా కాలం పాటు నా వెంట పడ్డారు. అప్పటికే ఆయనకి పెళ్లి అయింది .. పిల్లలు ఉన్నారు. అందువలన నేను ఆయనను పట్టించుకోకండా నా పని చేసుకుంటూ వెళ్లిపోయాను. ఆ రోజుల్లో మద్రాస్ లో కొన్ని రౌడీ గ్యాంగులు ఉండేవి. వాళ్ల నుంచి రక్షణ ఉంటుంది కదా అని ఆయనకి దగ్గరయ్యాను. ఒక ప్రమాదంలో ఆయన భార్య చనిపోవడంతో, ఆయనతో కలిసి జీవించాను" అని చెప్పారు.
" ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ల పెళ్లిళ్లు కూడా నేనే దగ్గరుండి చేయించాను. అయితే ఆయన పెద్ద కూతురు కారణంగా మా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. అందువలన చనిపోవడానికి కొన్ని సంవత్సరాల ముందు నుంచి ఆయనకి .. నాకు మధ్య ఎలాంటి సంబంధాలు లేవు. కూతురు మాట విని అతను నన్ను నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు. ఆయన ఆస్తులు నేను దోచుకోలేదు .. ఆయన చనిపోవడానికి నేనే కారణం అనే ప్రచారంలో నిజం లేదు" అని అన్నారు.