Sake Sailajanath: నేడు వైసీపీలోకి మాజీ మంత్రి సాకే శైలజానాథ్

- రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి గుడ్ బై చెప్పిన అనేక మంది కీలక నేతలు
- వైసీపీలో చేరికకు సిద్దమైన కాంగ్రెస్ కీలక నేత
- నేడు జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్న సాకే శైలజానాథ్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అనేకమంది వైసీపీ కీలక నేతలు పార్టీకి దూరమయ్యారు. రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు.. ఇలా చాలామంది పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇటీవల ఆ పార్టీలో కీలక నేతగా, నెంబర్ 2 పొజిషన్‌లో చక్రం తిప్పిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సైతం పదవికి, పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా పనిచేసిన శైలజానాథ్ వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు.
శుక్రవారం (నేడు) ఉదయం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ పార్టీలో చేరనున్నారు. ఇటీవల శైలజానాథ్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ కావడంతో ఆయన వైసీపీ వైపు చూస్తున్నారంటూ ప్రచారం జరిగింది. ఈ క్రమంలో జగన్ మోహన్ రెడ్డి ఆయన చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చేరికకు ముహూర్తం ఖరారైంది. శుక్రవారం ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారు.
కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసిన శైలజానాథ్.. వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ బాధ్యతల నుంచి ఆయన తప్పుకున్నారు. ఆ తర్వాత ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గత ఎన్నికల్లో సైతం ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అనుచరుడిగా గుర్తింపు తెచ్చుకున్న శైలజానాథ్ .. శింగనమల నియోజకవర్గం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించారు.