Yanamala: జగన్ 30 ఏళ్లు పాలించడం కాదు... జీవితాంతం జైల్లో ఉండాల్సిందే: యనమల

- 30 ఏళ్లు అధికారంలో ఉంటానన్న జగన్
- జీవితాంతం జైల్లో ఉండాల్సిందే అంటూ యనమల వ్యాఖ్యలు
- వారానికి ఒకరోజు ఏపీకి వచ్చే టూరిస్టు జగన్ అంటూ విమర్శలు
తాను 30 ఏళ్లు అధికారంలో ఉంటానని, గతంలో ప్రజల కోసం పాటుపడిన జగన్ ను చూశారని, ఇకపై కార్యకర్తల కోసం నిలబడే జగన్ చూస్తారని వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యానించడం తెలిసిందే. ఇకపై జగన్ 2.0 ఎలా ఉంటుందో చూపిస్తానని జగన్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు స్పందించారు.
ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రం స్థితిగతులు మార్చేస్తా... మీ బ్రతుకులు అన్నీ మార్చేస్తా... అని 2019 ఎన్నికల ముందు ఆర్భాట ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు అధికారం ఇస్తే... రాష్ట్రాన్ని 5 ఏళ్లలో 30 ఏళ్లు వెనక్కి నెట్టాడని విమర్శించారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఐదేళ్లలో రూ.12లక్షల కోట్లు పైబడి అప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి నేడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అప్పులు చేసిందని మాట్లాడడం హాస్యాస్పదం అని అన్నారు.
"వారానికి ఒకరోజు ఏపీకి వచ్చే టూరిస్టు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలు, సంక్షేమం, ప్రజల గురించి మాట్లాడడం చూస్తుంటే అతని మానసిక స్థితి ఇంకా బాగుపడినట్లు లేదు అని అర్థమవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అడుగడుగునా ద్రోహం చేసిన జగన్మోహన్ రెడ్డి మరోసారి వారిని అధఃపాతాళానికి తొక్కాలని చేస్తున్న ప్రయత్నాలు ఎప్పటికీ సఫలీకృతం కావు. మరోసారి జగన్ చేతిలో హత్యలకు గురికావడానికి దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు సిద్ధంగా లేరు.
జగన్మోహన్ రెడ్డి వద్దు అని రాష్ట్రమంతా ఓటుతో తమ వైఖరిని విస్పష్టంగా వెల్లడిస్తే... జగన్మోహన్ రెడ్డి ప్రజల తీర్పును ఇప్పటికే పలుమార్లు తప్పుబట్టడం... అవమానించడం వంటివి చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి కుట్రలు, కుతంత్రాలకు కాలం చెల్లింది. కూటమి ప్రభుత్వం.... ప్రజల ప్రభుత్వం... ప్రజలు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం. ఐదేళ్ల పాటు అరాచకాలకు గురైన మహిళలు జగన్మోహన్ రెడ్డిని ఛీదరించుకున్నారు.
తనకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని రాష్ట్ర ప్రజలపై జగన్ కక్ష పెంచుకున్నాడు. మంచి ప్రభుత్వ పరిపాలన, ప్రజలకు స్వేచ్ఛను ఇచ్చే ప్రభుత్వం, ప్రజలకు మేలు చేసే ప్రభుత్వాన్ని ప్రజలకు దూరం చేసి...ప్రజలకు లేని పోని అబద్దాలు చెప్పి మోసం చేసి తాను అధికారంలోకి వచ్చి, ప్రజలపై కక్ష తీర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ప్రజలకు కళ్లకు కట్టినట్లు కనబడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి మరోసారి అబద్ధాలతో తన అవినీతి పునాదులను నిలబెట్టుకోవాలని, తన అవినీతి సామ్రాజ్యాన్ని పునఃనిర్మించుకోవాలని ఆరాటపడుతున్నాడు. మనిషికి విషం ఎంత ప్రమాదమో... జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా అంతే ప్రమాదం అని గత ఐదేళ్లలో నిరూపితమైంది.
కనీసం గత ఐదేళ్లలో రోడ్డు మీదకు రావాలన్నా భయపడిన మహిళలు... నేడు స్వేచ్ఛా వాయువులు పీల్చడం జగన్ కు నచ్చడం లేదు. అందుకే రాష్ట్రంపై కక్ష పెంచుకుని, ఆగ్రహంతో రగిలిపోతున్నాడు. అందుకే ప్రజలను సంక్షేమ పథకాల పేరుతో రెచ్చగొట్టి, తన కక్ష తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. జగన్ కుట్రలను రాష్ట్ర ప్రజలంతా అర్థం చేసుకున్నారు, నమ్మే పరిస్థితుల్లో లేరు. జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో చేసిన తప్పులు, చట్టాల ఉల్లంఘనలు, దోపిడీలు, హత్యలు, ఇతర అరాచకాలకు 30 ఏళ్లు సీఎంగా ఉండడం కాదు... జీవితాంతం జైల్లో ఉండాల్సిందే" అంటూ యనమల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.