Nara Bhuvaneswari: చంద్రబాబు పీఏలు ఫ్రీగా వద్దామనునుకుంటే కుదరదు... టికెట్ కొనాల్సిందే: నారా భువనేశ్వరి

- నిధుల సేకరణకు భారీ మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్
- తమన్ సంగీత సారథ్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ యుఫోరియా మ్యూజికల్ నైట్
- ఫిబ్రవరి 15న విజయవాడలో కార్యక్రమం
- చంద్రబాబు రూ.6 లక్షలతో టికెట్ కొన్నారన్న నారా భువనేశ్వరి
ఏపీ సీఎం చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలోని ఎన్టీఆర్ ట్రస్ట్ నిధుల సేకరణ నిమిత్తం ఫిబ్రవరి 15న భారీ మ్యూజికల్ నైట్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఎన్టీఆర్ ట్రస్ట్ యుఫోరియా మ్యూజికల్ నైట్ పేరిట నిర్వహిస్తున్న ఈ సంగీత విభావరికి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదిక కానుంది. టాలీవుడ్ సంగీత దర్శకుడు తమన్ ఈ కార్యక్రమంలో తన ట్రూప్ తో ఆడియన్స్ ను ఉర్రూతలూగించనున్నాడు.
కాగా, ఓ కార్యక్రమంలో నారా భువనేశ్వరి మ్యూజికల్ నైట్ కార్యక్రమం గురించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ టికెట్ కొని ఈ కార్యక్రమానికి రావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు కూడా తన సొంత డబ్బుతో టికెట్ కొన్నారని వెల్లడించారు. చంద్రబాబు రూ.6 లక్షలతో టికెట్ కొన్నారని, ఐదుగురికి ఒక టేబుల్ బుక్ చేసుకున్నారని భువనేశ్వరి వివరించారు.
సాధారణంగా చంద్రబాబు ఖర్చులకు తానే డబ్బులు ఇస్తుంటానని, కానీ ఈసారి మాత్రం చంద్రబాబు తన సొంత ఖాతాలోని డబ్బుతో టికెట్ కొన్నారని తెలిపారు. అలాగని, చంద్రబాబు వెనుక వచ్చే ఆయన పీఏలు కూడా ఫ్రీగా వద్దామనుకుంటే కుదరదని, వారు కూడా టికెట్ కొనాల్సిందేనని ఆమె చమత్కరించారు. టికెట్ లేకపోతే మిమ్మల్ని లోపలికి రానివ్వబోమని వాళ్లని హెచ్చరించాను అని వివరించారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ సిబ్బంది కూడా టికెట్ కొంటేనే ఈ కార్యక్రమానికి అనుమతించడం జరుగుతుందని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. అయితే, భువనేశ్వరితో పాటు వేదికపై ఉన్న తమన్ స్పందిస్తూ... మీరు హెచ్చరించడం కూడా ఎంతో స్వీట్ గా ఉంది మేడమ్ అంటూ నవ్వేశారు.