Illegal Migrations: అక్రమ వలసదారుల తరలింపు కొత్తేమీ కాదు: జై శంకర్

- అక్రమ వలసదారులను భారత్ కు తిప్పి పంపిన అమెరికా
- రాజ్యసభలో ప్రకటన చేసిన కేంద్ర విదేశాంగ మంత్రి
- 2009 నుంచి ఇలాంటి బహిష్కరణలు జరుగుతూనే ఉన్నాయని వెల్లడి
అమెరికా ప్రభుత్వం భారత్ కు అక్రమ వలసదారులను ప్రత్యేక విమానంలో తిప్పి పంపిన నేపథ్యంలో, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జై శంకర్ నేడు రాజ్యసభలో ప్రకటన చేశారు.
అక్రమ వలసదారుల తరలింపు అనేది కొత్తేమీ కాదని అన్నారు. చాలా ఏళ్ల నుంచి దేశ బహిష్కరణలు జరుగుతున్నాయని, 2009 నుంచి ఇలాంటి బహిష్కరణలు చూస్తూనే ఉన్నామని తెలిపారు. ఇలాంటి బహిష్కరణల సమయంలో కొందరు ప్రాణాలు కోల్పోతుంటారని వివరించారు.
అక్రమ వలసలను అరికట్టేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉందని జై శంకర్ స్పష్టం చేశారు. ఒక్క భారత్ అనే కాకుండా... అన్ని దేశాల అక్రమ వలసదారులను అమెరికా వెనక్కి పంపిస్తోందని వెల్లడించారు. తమ దేశస్థులు చట్టవిరుద్ధంగా విదేశాల్లో ఉంటే వారిని స్వదేశాలకు రప్పించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.