YS Jagan: నాణేనికి రెండో వైపు ప్రజలకు వివరించాలని మీడియా ముందుకు వచ్చాను: జగన్

- సంపద సృష్టి చంద్రబాబు జేబులోనే జరిగిందన్న జగన్
- కేజ్రీవాల్ చేయలేని పని చంద్రబాబు చేసి చూపించారని ఎద్దేవా
- గ్రామాల్లో బెల్ట్ షాపులకు వేలం పాట నిర్వహించారని ఆరోపణ
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు పూర్తయిందని మాజీ ముఖ్యమంత్రి జగన్ గుర్తుచేశారు. ఈ తొమ్మిది నెలల కాలంలో ప్రభుత్వం చెప్పుకుంటున్న గొప్పలకు సంబంధించి నాణేనికి రెండో వైపు ప్రజలకు వివరించాలని మీడియా ముందుకు వచ్చినట్లు వివరించారు. ఎన్నికల సమయంలో సంపద సృష్టించడం, సృష్టించిన సంపదను ప్రజలకు పంచడమే తన లక్ష్యమంటూ చంద్రబాబు ప్రచారం చేశారని జగన్ గుర్తుచేశారు. రాష్ట్రంలో సంపద సృష్టి నిజమేనని, అయితే అది చంద్రబాబు జేబులోనే జరిగిందని జగన్ తీవ్రంగా మండిపడ్డారు. ఢిల్లీలో కేజ్రీవాల్ చేయలేని పనిని ఏపీలో చంద్రబాబు విజయవంతంగా చేసి చూపించారని ఎద్దేవా చేశారు.
మద్యం షాపులను ప్రైవేటీకరించే ప్రయత్నం చేసి కేజ్రీవాల్ జైలుకు వెళ్లారని చెప్పారు. అయితే, చంద్రబాబు మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని మేనేజ్ చేసి ఏపీలో మద్యం షాపులను విజయవంతంగా ప్రైవేటీకరించారని ఆరోపించారు. మద్యం షాపులకు టెండర్లు లేవు, లాటరీ విధానంలో తమ కార్యకర్తలకు కట్టబెట్టారని చెప్పారు. పోలీసుల సాయంతో మిగతా వాళ్లను బెదిరించి మద్యం షాపులన్నీ తమ కార్యకర్తలకే దక్కేట్లుగా చంద్రబాబు ప్రభుత్వం చక్రం తిప్పిందని ఆరోపించారు.
మద్యం షాపుల కేటాయింపుల సందర్భంగా బెదిరింపులు, కిడ్నాప్ లు జరగడం జనం చూస్తూనే ఉన్నారని చెప్పారు. గ్రామాల్లో బెల్ట్ షాపులకు వేలం పాడడం తెలిసిందేనని, వేలంలో ఎక్కువ మొత్తం పాడిన వారికి బెల్ట్ షాపులు పెట్టుకోడానికి అనధికారికంగా అనుమతిచ్చారని విమర్శించారు. ఇలా బెల్ట్ షాపులు పెట్టుకున్న వారు ఎంఆర్పీ కన్నా ఎక్కువ రేటుకు అమ్మడం మన కళ్ల ముందే జరుగుతోందని జగన్ తెలిపారు. మద్యం షాపులు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంటే ఈ సొమ్మంతా ప్రభుత్వ ఖజానాకే చేరేదన్నారు.
కాంట్రాక్టులలో నీకింత, నాకింత..
ప్రభుత్వం చేపట్టే పనులకు టెండర్లు పిలిచి, పనులు పూర్తయ్యాక కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లించే పద్ధతికి కూటమి సర్కారు ప్రభుత్వం స్వస్తి పలికిందని జగన్ ఆరోపించారు. మొబిలైజేషన్ పేరుతో కాంట్రాక్టర్ కు ముందే చెల్లింపులు జరిపే పద్ధతి తెచ్చారని కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పనులు ఇంకా ప్రారంభించకున్నా సరే కాంట్రాక్టులో పది శాతం చెల్లింపులు చేస్తోందని, అందులో 2 శాతం నీకు, 8 శాతం మాకు అంటూ ప్రభుత్వంలోని పెద్దలు పంచుకుంటున్నారని ఆరోపించారు. ఈ విధంగా కాంట్రాక్టులలో నీకింత, నాకింత పద్ధతి కొనసాగుతోందన్నారు. వీటన్నింటితో రాష్ట్రంలో సంపద సృష్టి జరగడం కాదు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఆవిరవుతోందని జగన్ మండిపడ్డారు. ఇవన్నీ చూసి భరించలేక ఎవరన్నా నిలదీసే ప్రయత్నం చేస్తే రెడ్ బుక్ రాజ్యాంగంతో వేధిస్తున్నారని, హామీల గురించి అడిగిన వారిని వెటకారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇసుక అమ్మకంలో స్కాం..
వైసీపీ ప్రభుత్వ హయాంలో కంటే రెట్టింపు రేట్లకు ఇసుక అమ్ముతున్నారని జగన్ ఆరోపించారు. ఇసుక, మద్యం, ఫ్లై యాష్.. ఇలా అన్నీ మాఫియాలేనని విమర్శించారు. ప్రతీ నియోజకవర్గంలో, మండలంలో, గ్రామంలో పేకాట క్లబ్‌లు నడిపిస్తున్నారని చెప్పారు. ఇవన్నీ పెదబాబు, చిన్నబాబు ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంలో పెదబాబుకు ఇంత, చినబాబుకు ఇంత, దత్తపుత్రుడికి ఇంత అనే వ్యవహారం నడుస్తోందని చెప్పుకొచ్చారు.
బాబు ష్యూరిటీ, మోసానికి గ్యారంటీగా..
ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రజలకు సూపర్ సిక్స్ తో పాటు 143 హామీలు ఇచ్చారని, ఇంటింటికీ బాండ్లు పంచారని జగన్ గుర్తుచేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే చొక్కా పట్టుకోండని ధీమాగా చెప్పారని అన్నారు. తొమ్మిది నెలల పాలన తర్వాత ఎన్ని హామీలు అమలయ్యాయి, ఆ మేనిఫెస్టో ఏమైందని నిలదీశారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అన్న టీడీపీ ఎన్నికల నినాదం ఇప్పుడు ‘బాబు ష్యూరిటీ మోసానికి గ్యారెంటీ’ గా మారిందని జగన్ వ్యాఖ్యానించారు. మరి ఇప్పుడు ఎవరి చొక్కా పట్టుకోవాలని జగన్ నిలదీశారు.