CPI Ramakrishna: చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ లేఖ

- 2024-25లో రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న రామకృష్ణ
- రాష్ట్రానికి రావాల్సిన రూ. 3,324 కోట్లు తగ్గాయని వ్యాఖ్య
- కేంద్ర ప్యాకేజీతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారం కాదన్న రామకృష్ణ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. 2024-25 ఏడాదికి కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన నిధులకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని లేఖలో ఆయన కోరారు. రాష్ట్రానికి రావాల్సిన రూ. 3,324 కోట్లు తగ్గిన మాట నిజమా? కాదా? అని ఆయన ప్రశ్నించారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది నిధుల రాక తగ్గిందని అన్నారు. వాస్తవాలను వెల్లడించకుండా ఏపీకి రూ. 3 లక్షల కోట్లు ఇచ్చామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పడం దారుణమని అన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ. 17 వేల కోట్ల అప్పులు ఉన్నాయని కేంద్రం చెపుతోందని... అలాంటప్పుడు కేవలం రూ. 11,500 కోట్ల ప్యాకేజీ ఇవ్వడం వల్ల సమస్య పరిష్కారం కాదని రామకృష్ణ అన్నారు. ప్లాంటును కాపాడుకోవడానికి శాశ్వత పరిష్కారం చూపించి, సొంత ఇనుము గనులు కేటాయించాలని కోరారు. సెయిల్ లో విలీనం చేయాలని ఆయన సూచించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగదనే అనుమానాలు తమకు ఇప్పటికీ ఉన్నాయని తెలిపారు.