Vamsi: ఆమె కళ్లు చూడటానికి అద్దె సైకిల్ తీసుకుని మరీ వెళ్లేవాడిని: డైరెక్టర్ వంశీ

- బుక్స్ చదవడమంటే ఇష్టమన్న వంశీ
- అందమైన కళ్లను గురించి ప్రస్తావన
- ఆమె విషయంలో అలా జరిగిందని వెల్లడి
- అలాంటి కళ్లు మద్రాసులో చూశానని వివరణ
దర్శకుడు వంశీ గురించి నిన్నటితరం వారికి బాగా తెలుసు. దర్శకుడిగా .. రచయితగా ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన సినిమాలను మళ్లీ మళ్లీ చూసే అభిమానులు ఇప్పటికీ ఉన్నారు. మధురమైన పాటలను గోదావరి గట్ల వెంట పడుచుపిల్ల మాదిరిగా పరిగెత్తించడం ఆయన ప్రత్యేకత. అలాంటి వంశీ తాజాగా 'ఐ డ్రీమ్'వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.
" నాకు చిన్నప్పటి నుంచి బుక్స్ చదవడం చాలా ఇష్టం. అలాగే కథలు రాయడం కూడా అలవాటైపోయింది. తొలినాళ్లలోనే నేను రాసిన కథలు బహుమతులు గెలుచుకున్నాయి. నా సినిమాలలో హీరోయిన్స్ కళ్లకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంటాను. మొదటిసారిగా నేను మా పక్క ఊర్లో ఒకావిడ కళ్లు చూశాను. ఆమె ఒక హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తూ ఉండేవారు .. వయసులో నాకంటే పెద్ద" అన్నారు.
"ఆమె కళ్ల కోసం రెగ్యులర్ గా ఆమెను చూస్తూ ఉండేవాడిని. ఆ కళ్లను చూడటం కోసమే అద్దె సైకిల్ తీసుకుని వెళుతూ ఉండేవాడిని. ఒక రోజున నేను ఆమెను చూడటానికి వెళుతూ ఉంటే ఒక వ్యక్తి నన్ను ఆపాడు. 'నువ్వు ఎక్కడికి వెళుతున్నావో నాకు తెలుసు .. ఆమె చనిపోయింది' అన్నాడు. అప్పటి నుంచి నేను చాలా డల్ అయ్యాను. మద్రాస్ వెళ్లిన తరువాత మళ్లీ అంత అందమైన కళ్లు చూశాను. ఆ అమ్మాయే నేను పరిచయం చేసిన హీరోయిన్" అని చెప్పారు.