Crime News: అడవి పంది అనుకుని తోటి వేటగాడిపై కాల్పులు.. అక్కడికక్కడే మృతి

- మహారాష్ట్రలోని పాల్ఘడ్ జిల్లాలో గత నెల 28న ఘటన
- కాల్పుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు
- మృతి చెందిన వ్యక్తిని అక్కడే వదిలేసి మరో వ్యక్తితో గ్రామానికి చేరిన వేటగాళ్లు
- ఆసుపత్రిలో చేరకపోవడంతో పరిస్థితి విషమించి అతడు కూడా మృతి
అడవి పందులను వేటాడేందుకు వెళ్లిన గ్రామస్థులు కొందరు సొంత బృందంలోని వ్యక్తినే అడవి పందిగా పొరబడి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలోని పాల్ఘడ్ జిల్లాలో గత నెల 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామస్థులు కొందరు ఒక బృందంగా ఏర్పడి మనోర్ జిల్లాలోని బోర్షెటీ అడవికి వెళ్లారు.
అక్కడ జట్లుగా విడిపోయి తలో వైపునకు వెళ్లి అడవి పందుల కోసం వేట ప్రారంభించారు. ఈ క్రమంలో ఓ గుంపునకు సమీపంలోని చెట్లగుబురులో అలికిడి వినిపించడంతో అడవి పందిగా భావించి కాల్పులు జరిపారు. దీంతో అటువైపున్న మరో బృందంలోని రమేశ్ వార్ధా (60) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి అన్య మహాలోద కాలికి గాయమైంది.
ఈ ఘటనతో భయపడిన వేటగాళ్ల బృందం విషయాన్ని పోలీసులకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ చెప్పకుండా రమేశ్ మృతదేహాన్ని అక్కడే పొదలమాటున దాచిపెట్టేశారు. గ్రూపులోని మిగతా నలుగురు రక్తమోడుతున్న మహాలోదను షిగావ్ పాటిల్‌పద గ్రామంలోని ఇంటిలో దిగబెట్టారు. అతడి పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పటికీ ఆసుపత్రికి తీసుకెళ్లలేదు. దీంతో జనవరి 31న అతడు కూడా మరణించారు. అయితే, ఈ విషయాన్ని కూడా పోలీసులకు తెలియజేయకుండానే అంత్యక్రియలు నిర్వహించారు.
తాజాగా విషయం పోలీసుల దృష్టికి చేరడంతో దర్యాప్తు ప్రారంభించారు. బుధవారం అడవికి వెళ్లిన పోలీసులు అక్కడ దాచిపెట్టిన వృద్ధుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, అన్య మహాలోద కుటుంబ సభ్యులు మాత్రం అతడు సహజంగానే మృతి చెందినట్టు చెప్పడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.