Jeet Adani: వివాహ శుభవేళ‌.. గొప్ప మ‌న‌సు చాటుకున్న గౌతమ్ అదానీ కుమారుడు జీత్ అదానీ

Jeet Adani Wedding Pledge Rs 10 Lakh For 500 Divyang Brides Every Year

  • రేపు వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న జీత్ అదానీ 
  • దివా జైమిన్ షాను పెళ్లి చేసుకోనున్న జీత్‌
  • ప్రతి యేటా 500 మంది దివ్యాంగ మహిళల పెళ్లికి ఒక్కొక్కరికి రూ. 10 లక్షల విరాళం
  • ఈ మేర‌కు ఈ జంట ప్రతిజ్ఞ చేసినట్లు 'ఎక్స్' వేదిక‌గా పంచుకున్న గౌతమ్ అదానీ

ప్ర‌ముఖ పారిశ్రామికవేత్త, బిలియనీర్ గౌతమ్ అదానీ కుమారుడు జీత్ అదానీ రేపు (శుక్రవారం) వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. దివా జైమిన్ షాను ఆయ‌న పెళ్లి చేసుకోనున్నారు. ఈ సంద‌ర్భంగా జీత్ అదానీ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక‌పై ప్రతి ఏడాది 500 మంది దివ్యాంగ మహిళల వివాహానికి ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు విరాళంగా ఇస్తామని ప్ర‌క‌టించారు. 

ఈ మేర‌కు ఈ జంట ప్రతిజ్ఞ చేసినట్లు గౌతమ్ అదానీ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా పంచుకున్నారు. వారి నిర్ణ‌యం తన‌కు ఎంతో సంతోషాన్ని క‌లిగించింద‌ని పేర్కొన్నారు. ఈ పవిత్ర ప్రయత్నం ద్వారా అనేక మంది వికలాంగులైన కుమార్తెలు, వారి కుటుంబాల జీవితాలు ఆనందం, గౌరవంతో ముందుకు సాగుతాయని గౌత‌మ్ అదానీ ఆశాభావం వ్య‌క్తం చేశారు. 

"నా కొడుకు జీత్, కోడలు దివా తమ వివాహ జీవితాన్ని ఒక పవిత్ర సంకల్పంతో ప్రారంభించడం చాలా సంతోషకరం. వారు ఇక‌పై ప్రతి సంవ‌త్స‌రం 500 మంది వికలాంగ సోదరీమణుల వివాహంలో ఒక్కో సోదరికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందించడం ద్వారా 'మంగళ సేవ' చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

ఒక తండ్రిగా ఈ 'మంగళ సేవ' నాకు అపారమైన సంతృప్తిని, అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ఈ పవిత్ర ప్రయత్నం ద్వారా అనేక మంది వికలాంగులైన కుమార్తెలు, వారి కుటుంబాల జీవితాలు ఆనందం, శాంతి, గౌరవంతో ముందుకు సాగుతాయని నాకు పూర్తి నమ్మకం ఉంది.

ఈ సేవా మార్గంలో ముందుకు సాగడానికి జీత్, దివాలకు ఆశీస్సులు, శక్తిని ప్రసాదించాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను" అని త‌న 'ఎక్స్' పోస్టులో గౌత‌మ్ అదానీ రాసుకొచ్చారు. 

కాగా, ఈ గొప్ప కార్యక్ర‌మాన్ని ప్రారంభించడానికి జీత్ అదానీ బుధ‌వారం నాడు త‌న నివాసంలో 21 మంది నూతన వధూవరులు (వికలాంగ మహిళలు), వారి భర్తలను కలిసిన‌ట్లు గౌత‌మ్ అదానీ తెలిపారు. కాగా, ఇరవై ఏడేళ్ల జీత్ అదానీ... అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ సంస్థకి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఎనిమిది విమానాశ్రయాల నిర్వహణ, అభివృద్ధి పోర్ట్‌ఫోలియో కలిగి ఉన్న ఇండియాలోనే అతిపెద్ద విమానాశ్రయ మౌలిక సదుపాయాల సంస్థ అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్‌. 

More Telugu News