Kerala: బావిలో ప‌డ్డ భ‌ర్త‌ను.. స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించి కాపాడుకున్న‌ 56 ఏళ్ల భార్య‌!

56 Years Old Woman Saved Husband Who Drowning into Well in Kerala

  • కేర‌ళలోని ఎర్నాకుళం జిల్లా పిర‌వ‌మ్ ప‌ట్ట‌ణంలో ఘ‌ట‌న
  • ప్ర‌మాద‌వ‌శాత్తు 40 అడుగుల లోతైన చేదబావిలో ప‌డిపోయిన భర్త 
  • తాడు సాయంతో బావిలోకి దిగి, భర్తను పట్టుకున్న భార్య 
  • ఆమె కేకలు విని ఇరుగుపొరుగు వారొచ్చి కాపాడిన వైనం     

ప్ర‌మాద‌వ‌శాత్తు 40 అడుగుల లోతు బావిలో ప‌డిపోయిన భ‌ర్త‌ను 56 ఏళ్ల భార్య స‌మ‌య‌స్పూర్తితో కాపాడుకుంది. కేర‌ళలోని ఎర్నాకుళం జిల్లా పిర‌వ‌మ్ ప‌ట్ట‌ణంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే... బుధ‌వారం ఉద‌యం త‌మ పెర‌ట్లోని మిరియాల చెట్టుపైకి ఎక్కి ర‌మేశ‌న్ (64) మిరియాలు తీస్తుండ‌గా ప్ర‌మాద‌వ‌శాత్తు కొమ్మ విర‌గ‌డంతో ప‌క్కనే ఉన్న 40 అడుగుల లోతైన చేదబావిలో ప‌డిపోయాడు. 

అది చూసిన భార్య ప‌ద్మ (56) క‌న్నీళ్లు పెడుతూ కేక‌లు వేయ‌కుండా స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించింది. ఒక తాడు సాయంతో వెంట‌నే బావిలోకి దిగింది. అప్ప‌టికే నీట మునిగి స్పృహ కోల్పోయే ప‌రిస్థితిలో ఉన్న భ‌ర్త‌ను సుమారు 20 నిమిషాల పాటు ఆమె అలాగే ఒడిసిప‌ట్టుకుని పైకి వినిపించేలా గ‌ట్టిగా కేక‌లు వేసింది. 

ఆమె కేకలు విన్న‌ అటుగా వెళుతున్న వారు ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చి బావిలోకి చూశారు. వెంట‌నే పోలీసుల‌కు, అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. స్థానికుల స‌మాచారంతో ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న అగ్నిమాప‌క‌, పోలీసు సిబ్బంది వ‌ల‌ల సాయంతో దంప‌తులిద్ద‌రినీ బ‌య‌ట‌కు తీశారు. అనంత‌రం ర‌మేశ‌న్‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఇలా సాహ‌సోపేతంగా, స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించి భ‌ర్త‌ను కాపాడుకున్న ప‌ద్మ‌పై నెట్టింట ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది.     

  • Loading...

More Telugu News