Tirupati: భర్త మృతదేహాన్ని తనకే ఇవ్వాలన్న మొదటి భార్య.. రెండో భార్య ధర్నా!

- తిరుపతిలో స్విమ్స్ ఆసుపత్రి వద్ద ఘటన
- అనారోగ్యంతో మృతి చెందిన భర్త
- మృతదేహం కోసం ఇద్దరు భార్యల పోటీ
- ఇరు కుటుంబాలు సయోధ్యకు వచ్చాక అప్పగిస్తామన్న పోలీసులు
భర్త మృతదేహం కోసం ఇద్దరు భార్యలు గొడవ పడ్డారు. తమకు అప్పగించాలంటే, తమకు అప్పగించాలంటూ ఇరు కుటుంబాల మధ్య జరిగిన గొడవలో చివరికి పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి వద్ద జరిగిందీ ఘటన.
చిత్తూరు జిల్లా నారాయణవనం మండలం చిత్తూరు కండ్రిగకు చెందిన ట్రాన్స్‌కో రిటైర్డ్ డీఈ సుబ్రహ్మణ్యం (76) మూడేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు ఇద్దరు భార్యలు. ఇటీవల ఆయన పరిస్థితి విషమంగా మారడంతో రెండో భార్య జానకి, కుమారుడు నవీన్‌కుమార్ కలిసి చికిత్స కోసం స్విమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి సుబ్రహ్మణ్యం మృతి చెందారు.
తిరుపతిలోనే ఉంటున్న ఆయన మొదటి భార్య పద్మ, కుమారుడు రవి ఆసుపత్రికి వచ్చి అధికారులను కలిశారు. తాను సుబ్రహ్మణ్యం మొదటి భార్యనని, మృతదేహాన్ని తమకు అప్పగించాలని కోరారు. దీనికి జానకి కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారు. మృతదేహాన్ని తమకే అప్పగించాలని కోరారు. నిన్న సాయంత్రం గ్రామస్థులు, బంధువులతో కలిసి ఆసుపత్రి వద్ద ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన విరమింపజేశారు. మృతదేహం విషయంలో ఇరు కుటుంబాలు సయోధ్యకు వచ్చిన తర్వాతనే అప్పగిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.