AAP: ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత

- ప్రతిసారీ మా పార్టీ అధికారంలోకి రాదనే ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయని వ్యాఖ్య
- కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల కోసమే పని చేశారన్న పార్టీ నేత సుశీల్ గుప్తా
- ఫలితాలు మాకే అనుకూలంగా ఉంటాయి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. దాదాపు అన్ని సర్వేలు కూడా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశముందని చెప్పడంపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత సుశీల్ గుప్తా స్పందించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీలో ఇది నాలుగో అసెంబ్లీ ఎన్నికలని, కానీ ప్రతి ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ తమ పార్టీ అధికారంలోకి రాదని అంచనా వేశాయని ఆయన అన్నారు.
గతంలో తామే అధికారంలోకి వచ్చామని గుర్తు చేశారు. తమ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల కోసం పని చేశారని ఆయన పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్‌ను పక్కన పెడితే, ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగానే ఉంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వమే వస్తుందని ఆయన అన్నారు.