New Delhi: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముగిసిన పోలింగ్

- సాయంత్రం ఆరు గంటలతో ముగిసిన పోలింగ్
- ఆరు గంటల తర్వాత వరుసలో నిలబడిన వారికి ఓటు వేసే అవకాశం
- ఓటు హక్కును వినియోగించుకున్న పలువురు ప్రముఖులు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 70 అసెంబ్లీ స్థానాలకు సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగిసింది. సాయంత్రం ఐదు గంటల సమయం వరకు దేశ రాజధానిలో 57.70 శాతం పోలింగ్ నమోదయినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆరు గంటల తర్వాత క్యూలో నిలబడిన వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. నార్త్-ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గంలో అత్యధికంగా, న్యూఢిల్లీలో అత్యల్పంగా పోలింగ్ నమోదైంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి, కేంద్రమంత్రి జైశంకర్ సహా పలువురు ప్రముఖులు తొలి గంటలోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు తమిళనాడులోని ఈరోడ్ (ఈస్ట్), ఉత్తరప్రదేశ్‌లోని మిల్కిపూర్‌లో ఉప ఎన్నికలు జరిగాయి. ఈరోడ్ ఈస్ట్ ఎమ్మెల్యే ఈవీకేఎస్ ఇళంగోవన్ మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయోధ్యలోని మిల్కిపూర్‌లో ఉప ఎన్నికను సమాజ్‌వాది పార్టీ, బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.