YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. అప్రూవర్ దస్తగిరి ఫిర్యాదుతో నలుగురిపై కేసు నమోదు

- కడప జైల్లో ఉన్నప్పుడు డీఎస్పీ నాగరాజు, సీఐ ఈశ్వరయ్య, చైతన్య రెడ్డి బెదిరించారని ఫిర్యాదు
- జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్ ఇబ్బంది పెట్టారన్న దస్తగిరి
- కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు దస్తగిరి అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే. దస్తగిరి ఫిర్యాదు మేరకు నలుగురిపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి, గతంలో జమ్మలమడుగు డీఎస్పీగా పని చేసిన నాగరాజు, ఎర్రగుంట్ల సీఐగా పని చేసిన ఈశ్వరయ్య, కడప సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ గా పని చేసిన ప్రకాశ్ లపై కేసు నమోదు చేశారు.
2023 అక్టోబర్ నుంచి 2024 ఫిబ్రవరి వరకు కడప సెంట్రల్ జైల్లో దస్తగిరి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ సమయంలో హత్య కేసులో వైసీపీ నేతలకు మద్దతుగా మాట్లాడాలని నాగరాజు, ఈశ్వరయ్య బెదిరించినట్టు దస్తగిరి ఫిర్యాదు చేశారు. 2023 నవంబర్ లో జైలుకు వచ్చిన చైతన్య రెడ్డి... అప్పటి సీబీఐ ఎస్పీ రాంసింగ్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాంసింగ్ కు వ్యతిరేకంగా మాట్లాడితే రూ. 20 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారని తెలిపారు. జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్ తనను ఇబ్బందులకు గురి చేశారని చెప్పారు. ఈ క్రమంలో ఈ నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.