Seethakka: తీన్మార్ మల్లన్న మా పార్టీనా, కాదా నిర్ణయించుకోవాలి: సీతక్క ఆగ్రహం

Seethakka fires at Teenmar Mallanna

  • తీన్మార్ మల్లన్న గెలుపు కోసం చాలా కష్టపడ్డామన్న సీతక్క
  • పార్టీలో ఉన్నప్పుడు పార్టీ లైన్‌లో మాట్లాడాలని సూచన
  • కుల గణన నివేదికకు నిప్పు పెట్టడం దారుణమన్న మంత్రి

సొంత పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై తెలంగాణ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తీన్మార్ మల్లన్న తమ పార్టీకి చెందిన వారో కాదో ఆయనే నిర్ణయించుకోవాలని ఆమె అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం తాము ఎంతో కష్టపడ్డామని ఆమె పేర్కొన్నారు. పార్టీలో ఉన్నప్పుడు పార్టీ లైన్‌లోనే మాట్లాడాలని సూచించారు.

ఆయన ఏదైనా అంశాన్ని లేవనెత్తాలనుకుంటే పార్టీ నిర్వహించే సమావేశాలకు వచ్చి ప్రశ్నించవచ్చునని ఆమె అన్నారు. ఆయనకు ఎలాంటి అనుమానం ఉన్నా వచ్చి నిలదీయవచ్చునన్నారు. కుల గణన నివేదికకు నిప్పు పెట్టడం దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

కుల గణన నివేదిక తప్పుల తడక అని, దానిని తీన్మార్ మల్లన్న కాల్చివేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క స్పందించారు.

కుల గణనలో తప్పులు జరిగాయని విమర్శలు చేసిన బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై కూడా మంత్రి స్పందించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు కుల గణనలో పాల్గొనలేదన్నారు. సర్వేలో భాగస్వాములు కాని వారికి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. దేశంలోనే తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కుల గణన చేసిందని, ఇది దేశానికి దిక్సూచి అని ఆమె అన్నారు.

  • Loading...

More Telugu News