Kejriwal: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి చూపూ ఆ ఐదు స్థానాలపైనే..!

- న్యూఢిల్లీ నుంచి మాజీ సీఎం కేజ్రీవాల్ పోటీ
- కల్కాజీ బరిలో బీజేపీ నుంచి రమేశ్ బిధూరి, ఆప్ నుంచి సీఎం అతిశీ
- జంగ్ పుర నియోజకవర్గంలో పోటీ పడుతున్న మనీశ్ సిసోడియా
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ రోజు జరుగుతోంది. మొత్తం 70 నియోజకవర్గాల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలతో పాటు స్వతంత్రులు 699 మంది పోటీ చేస్తున్నారు. మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ, పోగొట్టుకున్న ప్రాభవాన్ని తిరిగి పొందాలని కాంగ్రెస్ పార్టీ, ఈసారి ఎలాగైనా ఢిల్లీలో పాగా వేయాలని బీజేపీ హోరాహోరీగా ప్రచారం చేశాయి. అన్ని పార్టీలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఉచితాలకు దూరంగా ఉండే బీజేపీ ఈ ఎన్నికల సందర్భంగా పలు ఉచిత పథకాలు ప్రకటించడం గమనార్హం. ఇక ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో పలు సంచలన ఆరోపణలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలోనే ఢిల్లీలోని ఐదు నియోజకవర్గాల్లో జరుగుతున్న పోలింగ్ పై అందరూ దృష్టి సారించారు.
అందరి చూపూ ఆ ఐదు స్థానాలపైనే..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు నియోజకవర్గాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మాజీ సీఎం, ప్రస్తుత సీఎంలతో పాటు మాజీ డిప్యూటీ సీఎం పోటీ చేస్తున్న నియోజకవర్గాలు ఇందులో ఉన్నాయి.
న్యూఢిల్లీ
మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ నియోజకవర్గంలో పార్టీ జెండా పాతాలని బీజేపీ, కాంగ్రెస్ పట్టుదలగా ఉన్నాయి. ఇందుకోసం ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మను బీజేపీ బరిలోకి దించింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా తనదైన ముద్ర వేసిన దివంగత షీలా దీక్షిత్ ను గుర్తుచేసేలా కాంగ్రెస్ పార్టీ ఆమె కుమారుడు సందీప్ దీక్షిత్ ను నిలబెట్టింది. దీంతో మాజీ సీఎం వర్సెస్ మాజీ సీఎంల కుమారులుగా న్యూఢిల్లీ నియోజకవర్గం పోరు ఆసక్తికరంగా మారింది.
జంగ్ పుర
ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జంగ్ పుర నుంచి బరిలోకి దిగారు. లిక్కర్ స్కాంలో జైలుపాలైన సిసోడియా తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం లిక్కర్ కేసులో బెయిల్ లభించడంతో సిసోడియా బయటకు వచ్చారు. సిసోడియాపై బీజేపీ తర్వీందర్ సింగ్ మార్వాను, కాంగ్రెస్ పార్టీ పర్హాద్ సూరిని నిలబెట్టాయి.
పర్పత్ గంజ్
2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పర్పత్ గంజ్ నుంచి మనీశ్ సిసోడియా పోటీచేసి గెలుపొందారు. అయితే, ఈసారి ఈ స్థానంలో ఆప్ అభ్యర్థిని మార్చింది. యూపీఎస్సీ ట్యూటర్ గా పేరొందిన అవధ్ ఓజాను ఇక్కడ నిలబెట్టింది. బీజేపీ నుంచి రవీందర్ సింగ్ నేగి ఇక్కడ పోటీపడుతుండగా, కాంగ్రెస్ పార్టీ తరఫున ఛౌదరి అనిల్ కుమార్ బరిలోకి దిగారు.
కల్కాజీ
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ సీనియర్ నేత అతిశీ కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీపడుతున్నారు. బీజేపీ తరఫున రమేశ్ బిధూరి బరిలోకి దిగారు. ఈ నియోజకవర్గంలో ప్రధాన పోటీ వీరిద్దరి మధ్యే ఉండనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బిజ్వాసన్
గతేడాది ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ మంత్రి కైలాశ్ గెహ్లాట్ బిజ్వాసన్ నియోజకవర్గ బరిలో నిలిచారు. ఇక్కడ ఆప్ నుంచి సురేంద్ర భరద్వాజ్ పోటీ పడుతుండగా, కాంగ్రెస్ పార్టీ దేవేంద్ర సెహ్రావత్ ను నిలబెట్టింది.