KTR: ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ సానుకూలం: కేటీఆర్

- వర్గీకరణకు మద్దతుగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశామన్న కేటీఆర్
- 2001 నుంచి తమ పార్టీ ఎస్సీ వర్గీకరణపై స్పష్టతతోనే ఉందని వెల్లడి
- బీసీల విషయంలో ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ శాసనసభ నుంచి వాకౌట్
ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ పార్టీ సానుకూలంగా ఉందని, ప్రభుత్వం నిర్ణయాన్ని తాము సమర్థిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ అంశంపై ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వర్గీకరణకు మద్దతు తెలుపుతూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించామని ఆయన వెల్లడించారు. 2001 సంవత్సరం నుంచి తమ పార్టీ ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన వైఖరితోనే ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మరొక అస్థిత్వ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న మంద కృష్ణ మాదిగను గుర్తు చేసుకోవాలని ఆయన అన్నారు. వర్గీకరణ కోసం పోరాడుతున్న ఎమ్మార్పీఎస్, టీఎమ్మార్పీఎస్, ఇతర సంఘాలకు కేసీఆర్ ఎల్లప్పుడూ అండగా ఉన్నారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ఉన్న నిజాయతీని గుర్తించాం కాబట్టే ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా మద్దతు ఇచ్చామని ఆయన అన్నారు. ఎమ్మార్పీఎస్ పోరాటంలో అమరులైన కుటుంబాలను కేసీఆర్ ఆదుకున్నారని తెలిపారు.
శాసనసభ నుండి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్
బీసీల విషయంలో ప్రభుత్వ వైఖరి సరికాదంటూ బీఆర్ఎస్ శాసనసభ నుంచి వాకౌట్ చేసింది. బీసీల జనాభాను తక్కువ చేసి చూపిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ నేఫథ్యంలో బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.