Doctor Consultation: పెద్ద డాక్టర్ కు ఫీజు కడితే అసిస్టెంట్ వద్దకు పంపారట... అపోలో ఆసుపత్రిపై రోగి ఫైర్

అపోలో ఆసుపత్రిలో సీనియర్ డాక్టర్ కు చూపించుకునేందుకు అపాయింట్ మెంట్ ఫీజు చెల్లించిన వ్యక్తిని అసిస్టెంట్ వద్దకు పంపించారట. దాంతో, ఆ వ్యక్తి భగ్గుమంటున్నాడు.
ఢిల్లీలోని సరిత విహార్ ప్రాంతంలో ఉన్న అపోలో ఆసుపత్రిలో పెద్ద డాక్టర్ కు చూపించుకునేందుకు గజేంద్ర యాదవ్ అనే వ్యక్తి రూ.2.300 అపాయింట్ మెంట్ ఫీజు చెల్లించాడు. ఢిల్లీకి చెందిన గజేంద్ర యాదవ్... తనకు నిర్దేశించిన సమయానికి ఆసుపత్రికి వెళ్లాడు. అయితే, ఆసుపత్రి సిబ్బంది గజేంద్ర యాదవ్ ను సీనియర్ డాక్టర్ కు బదులు అతడి అసిస్టెంట్ వద్దకు పంపించారు.
అన్ని విషయాలు ఆ అసిస్టెంటే మాట్లాడుతుండగా, ఎప్పటికో సీనియర్ డాక్టర్ వచ్చారు. అది కూడా కాసేపు కేసు గురించి చర్చించి పలు సూచనలు ఇచ్చి వెళ్లిపోయారు.
కానీ రోగి గజేంద్ర యాదవ్ మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పేరుమోసిన డాక్టర్ కు చూపించుకుందామని రూ.2,300 చెల్లిస్తే అసిస్టెంట్ వద్దకు పంపిస్తారా? ఇప్పుడు నేనేం చేయాలో, ఏం చేయకూడదో చెప్పేది ఆ సహాయకుడా? సీనియర్ డాక్టర్ కు ఉండే నైపుణ్యం, అనుభవం అతడిలో ఎక్కడున్నాయి? అంటూ గజేంద్ర యాదవ్ సోషల్ మీడియా వేదికగా ఆక్రోశం వ్యక్తం చేశాడు.
అపోలో హాస్పిటల్... ఇదే ప్రవర్తన? సీనియర్ డాక్టర్ కు కాకుండా అతడి అసిస్టెంట్ కు చూపించుకోవాలనుకున్నా కన్సల్టేషన్ ఫీజు చెల్లించాలా? ఆ విషయం మాకు ఎవరైనా చెప్పారా? సీనియర్ డాక్టర్ కు చూపించుకోవాలన్న ఉద్దేశంతోనే అపాయింట్ మెంట్ ఫీజు చెల్లించాం... ఇలాంటి పరిస్థితి చాలా ఇబ్బందికరం" అని గజేంద్ర యాదవ్ ట్వీట్ చేశాడు.
సోషల్ మీడియాలో ఈ పోస్టు వైరల్ అయింది. చాలామంది యూజర్లు అతడికి మద్దతుగా నిలిచారు. ఆసుపత్రుల్లో అనేకమంది సీనియర్ డాక్టర్లు ఇలాగే వ్యవహరిస్తుంటారని కామెంట్స్ చేశారు.