KTR: వెల్‌డన్ తెలంగాణ సీఎంవో: తెలంగాణ ప్రభుత్వంపై వ్యంగ్యంగా కేటీఆర్ ట్వీట్

- సమగ్ర కుటుంబ సర్వేను మాయం చేశారంటూ క్రిశాంక్ విమర్శ
- సమగ్ర కుటుంబ సర్వేను ఎందుకు మాయం చేశారని క్రిశాంక్ ప్రశ్న
- క్రిశాంక్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ కేటీఆర్ చురక
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్ల క్రితం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ నుంచి తొలగించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ చర్యను ఉద్దేశించి "వెల్‌డన్ తెలంగాణ సీఎంవో, వాట్ ఎ ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్" అంటూ ఆయన వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ఈరోజు తెలంగాణ ప్రజలకు అందుబాటులో లేకుండా అధికారులు మాయం చేశారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు. అధికారికంగా అందుబాటులో ఉన్న సర్వే నివేదికను ఎందుకు తొలగించాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఈ సర్వేపై చేస్తున్న అసత్యాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన పేర్కొన్నారు.
మన్నె క్రిశాంక్ చేసిన ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేస్తూ వ్యంగ్యంగా స్పందించారు. ఈ సందర్భంగా 'ఎంసీఆర్‌హెచ్ఆర్డీఐ'లో 73 పేజీల సమగ్ర కుటుంబ సర్వే నివేదిక అందుబాటులో లేదంటూ ఒక ఇమేజ్‌ను ఆయన జత చేశారు.