Mithun Reddy: టీడీపీ ఎంపీలతో కలిసి పని చేసేందుకు కూడా సిద్ధం: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి

- పోలవరం విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందన్న మిథున్ రెడ్డి
- ప్రాజెక్ట్ ఎత్తు తగ్గిస్తూ బడ్జెట్ లో ప్రతిపాదనలు పెట్టారని విమర్శ
- రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేస్తామని వ్యాఖ్య
పోలవరం ప్రాజెక్ట్ విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. అవసరమైతే పార్టీలకు అతీతంగా ఎంపీలతో కలిసి లోక్ సభలో పోరాడేందుకు తాము సిద్ధమని చెప్పారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే చర్చలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పోలవరం ప్రాజెక్ట్ కెపాసిటీని తగ్గించవద్దని మిథున్ రెడ్డి కోరారు. ప్రాజెక్ట్ కెపాసిటీ 194 టీఎంసీలని... ఏడున్నర లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేలా ప్రాజెక్ట్ ని డిజైన్ చేశారని తెలిపారు. ప్రాజెక్ట్ ఎత్తును తగ్గిస్తూ బడ్జెట్ లో ప్రతిపాదనలు పెట్టారని.... దీనివల్ల ప్రాజెక్ట్ కెపాసిటీ 194 టీఎంసీల నుంచి 115 టీఎంసీలకు పడిపోయిందని చెప్పారు. కేవలం 3.20 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు అందుతుందని తెలిపారు. దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ అన్యాయాన్ని ఎదిరించేందుకు టీడీపీ ఎంపీలతో కలిసి పని చేసేందుకు కూడా సిద్ధమేనని అన్నారు. కెపాసిటీ తగ్గిస్తే బనకచర్లకు నీరు ఎలా అందుతుందని ప్రశ్నించారు.
మార్గదర్శి సంస్థ రూ. 2,600 కోట్ల కుంభకోణానికి పాల్పడిందని చెప్పారు. మార్గదర్శి కుంభకోణంపై దర్యాప్తు చేయాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయవద్దని అన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో క్రమంగా ఇంగ్లీష్ మీడియంను రద్దు చేస్తున్నారని విమర్శించారు.